చినబాబుపై సీరియస్ అవుతున్న సీనియర్లు!

ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో చంద్రబాబునాయుడు తలమునకలై ఉంటున్న నేపథ్యంలో ఏడాదిన్నరగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, టీడీపీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న నారా లోకేష్ పార్టీపై క్రమంగా పట్టుసాధిస్తున్నారు. చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడైనప్పటికీ... పార్టీ వ్యవహారాలను పూర్తిగా చినబాబుకే వదిలేయడంతో సీనియర్లు అయినా, జూనియర్లయినా లోకేష్ దగ్గరికే వెళ్లాల్సి వస్తోంది, పైగా ప్రతిరోజూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వస్తూ నేతలతోనూ కార్యకర్తలతోనూ సమావేశమవుతూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు, సభ్యత్వ నమోదును కొత్త పుంతలు తొక్కించడంతోపాటు పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న లోకేష్... ప్రతి జిల్లాపై పట్టు సాధిస్తున్నారు, ఇప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా నియమితులవడంతో పార్టీలో చినబాబు పాత్ర ఏంటో చెప్పకనే చెబుతుంది.

అయితే టీడీపీలో అన్నీతానై వ్యవహరిస్తున్న లోకేష్... సీనియర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సీనియర్లను కూడా అవమానిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మంత్రుల పనితీరుపై సైతం నిఘా పెట్టి సొంత రేటింగ్ లు కూడా ఇస్తున్న చినబాబుపై పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నారని, పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉంటున్న నేతలను కూడా చినబాబు కేర్ చేయడం లేదని, కనీసం గౌరవం ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు, దానికి కేఈ కృష్ణమూర్తి ఎపిసోడే రుజువంటున్నారు, లోకేష్ నచ్చకపోవడం వల్లే కేఈ చేసిన బదిలీలను ఆగమేఘాల మీద నిలిపివేయించారని అంటున్నారు.

అలాగే ఏళ్లతరబడి పార్టీనే నమ్ముకుని ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ లీడర్ కరణం బలరాం విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని, కాంగ్రెస్ నుంచి వచ్చిన మాగుంటకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన బాబు... కేబినెట్ లోకి కూడా తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది, ఇదంతా చినబాబు చలువేనని అంటున్నారు, ఇక మూడు దశబ్దాలుగా పార్టీలో ఉంటూ కడప జిల్లా టీడీపీకి సేవలందిస్తున్న రామసుబ్బారెడ్డి విషయంలోనూ చినబాబు చులకన మాట్లాడారని అంటున్నారు, ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న లోకేష్... రామసుబ్బారెడ్డి అభ్యంతరాలను అస్సలు పట్టించుకోలేదని చెప్పుకుంటున్నారు. దాంతో సీనియర్లను చినబాబు చిన్నచూపు చూస్తున్నాడని పార్టీలో ప్రచారం జోరందుకుంది.

రాష్ట్ర రాజకీయాల్లో డక్కాముక్కీలు తిన్న సీనియర్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డికి కూడా లోకేష్ దగ్గర చేదు అనుభవమే ఎదురైంది, లోకేష్ ను కలవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి.. గంటల తరబడి వెయిట్ చేసిన తర్వాత బిజీగా ఉన్నానంటూ చినబాబు కలవడానికి నిరాకరించినట్లు సమాచారం, దాంతో తనలాంటి సీనియర్ లీడర్ కే ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తంచేశాడట. లోకేష్ దూకుడు ఇలాగే ఉంటే అసలుకే మోసం తెస్తుందని హెచ్చరించాడట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu