డొక్కా..సీన్ రివర్స్ అయింది!
posted on Oct 5, 2015 4:53PM
.jpg)
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెదేపాలో చెరక ముందు వైకాపాలో చేరేందుకు సిద్దపడటం, తన రాజకీయ గురువు రాయపాటి సాంభశివరావు సూచన మేరకు చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకోవడం, వైకాపాలో చేరుతానని మాట ఇచ్చి తప్పినందుకు అంబటి రాంబాబుకి మీడియా ద్వారా క్షమాపణ చెప్పిన సంగతి అందరికీ తెలుసు. ఒకవేళ ఆనాడు రాయపాటి కనుక ఆపకపోయుంటే ఆయన ఇప్పుడు వైకాపాలో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డితో బాటు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అతని ప్రభుత్వాన్ని విమర్శిస్తుండేవారని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. కానీ తెదేపాలో చేరడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించవలసి వస్తోంది. తెదేపా అధికార ప్రతినిధిగా నియమింపబడటంతో తెదేపా తరపున ఇంతకు ముందు తను చేరాలనుకొన్న వైకాపాతో దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయవలసి రావడం విచిత్రమే. కానీ రాజకీయాలలో అది చాలా సహజం కనుక ఇప్పుడు డొక్కావారు జగన్మోహన్ రెడ్డి గురించి చెపుతున్న మాటలను విందాము.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా పేరుతో ఆయన అర్ధం పర్ధం లేని దీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి అయిపోదామని పగటి కలలు కంటున్నారు. కానీ ఆయన ఎన్ని దీక్షలు చేసినా ఎన్ని కలలు కన్నా ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు. క్లిష్టపరిస్థితులో ఉన్న రాష్ట్రానికి అండగా నిలబడకుండా ఈవిధంగా ఇంకా సమస్యలు సృష్టిస్తున్నారు. వేగంగా రాష్ట్రాభివృద్ధి జరగాలని ఆయనకు నిజంగా కోరుకొంటున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. ఆయనే కాదు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు సహకరించాలి,” అని అన్నారు.