లాలూ ప్రసాద్ తో చేతులు కలిపి నితీష్ పొరపాటు చేసారా?
posted on Oct 5, 2015 3:08PM
.jpg)
మరొక్క వారం రోజుల్లో బీహార్ అసెంబ్లీకి మొదటి విడత ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అన్ని రాజకీయపార్టీల ప్రచారం జోరందుకొంది. జనతా పరివార్ తరపున నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ, కేంద్రమంత్రి రామ్ విలాష్ పాశ్వాన్ ప్రచారం చేస్తున్నారు. జనతా పరివార్ తో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ ప్రచారం చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ములాయం సింగ్, ఎం.ఐ.ఎం. తరపున అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తున్నారు. ఈసారి బీహార్ లో వామ పక్షాలన్నీ కలిసి వామపక్ష కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నప్పటికీ పోటీ ప్రధానంగా జనతా పరివార్, బీజేపీల మధ్యే జరుగుతోంది.
జనతా పరివార్ తరపున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ప్రచారం చేస్తున్నప్పటికీ, నితీష్ కుమార్ సమర్ధత, పరిపాలన గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. నితీష్ కుమార్ మీద ఆధారపడి జనతా పరివార్ ప్రచారం సాగుతుంటే, బీజేపీ ప్రధానంగా నరేంద్ర మోడీ ఆకర్షణ మీదే ఆధారపడుతోంది. కేంద్రంలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది కనుక బీహార్ రాష్ట్రంలో కూడా బీజేపీకే అధికారం కట్టబెడితే, రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా అందిస్తామని బీజేపీ గట్టిగా ప్రచారం చేసుకొంటోంది.
అయితే ఈ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంతో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్.జె.డి.కి తనతో సమానంగా సీట్లు పంచి ఇవ్వడం చాలా పెద్ద పొరపాటని చెప్పవచ్చును. ప్రభుత్వంలో తను కూడా చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతోనే లాలూ వంద సీట్లు డిమాండ్ చేసి తీసుకొన్నారు. ఒకవేళ జనతా పరివార్ ఎన్నికలలో నెగ్గినా లాలూ ప్రసాద్ యాదవ్ కారణంగా ప్రభుత్వంలో సుస్థిరత ఉండకపోవచ్చును. ఈ ఎన్నికలలో ఆర్.జె.డి. కూడా తగినన్ని సీట్లు సంపాదించుకొనట్లయితే అప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వం లాలూ ప్రసాద్ దయతోనే నడిపించుకోవలసి ఉంటుంది. ఒకవేళ లాలూ పార్టీ తగినన్ని సీట్లు గెలుచుకోలేకపోయినా జనతా పరివార్ అధికారంలోకి రాలేదు. అప్పుడు మద్దతు కోసం వేరే పార్టీలని ఆశ్రయించవలసివస్తుంది. కనుక ఏవిధంగా చూసినా లాలూతో చేతులు కలిపినందుకు నితీష్ కుమారే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ లో సుస్థిరమయిన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పుకొంటున్న బీజేపీ ఇదే పాయింట్ గురించి గట్టిగా ప్రచారం చేసుకోగలిగితే దాని విజయావకాశాలు మెరుగవవచ్చును.