విలువలతో పెరిగా.. ఇలాంటి అవమానం మరెవరికీ జరగకూడదు..
posted on Nov 26, 2021 11:06AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తెలుగు దేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని భువనేశ్వరి తన ప్రకటనలో పేర్కొన్నారు.
