బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు
posted on Jan 2, 2026 7:46AM

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.
స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే. భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది. కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.