కసబ్ ఫోన్ పగలగొట్టిన పరమ్‌బీర్!.. వీడు మామూలోడు కాదు..
posted on Nov 26, 2021 11:05AM
ముంబై కాల్పుల ఉగ్రవాది మహ్మద్ అజ్మల్ కసబ్. పాకిస్తాన్‌కు చెందిన వాడు మనిషి కాదు.. నరహంతకుడు. అనేక మందిని కాల్చిచంపిన ఉన్మాది. ఆనాడు కసబ్ వాడిన సెల్‌ఫోన్.. ఆ కేసులో ఎంతో కీలకం. ఆ సమయంలో కసబ్‌కు పాకిస్తాన్ నుంచి ఫోన్‌లో ఆదేశాలు వచ్చాయని అంటారు. అందుకే, కసబ్ సెల్‌ఫోన్‌ను ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించి డేటా మొత్తం బయటకు తీసుంటే.. ప్రపంచం ముందు పాపిస్తాన్‌ను దోషిగా నిలబెట్టే ఛాన్స్ ఉండేది. కానీ, అంతటి కీలకమైన కసబ్ సెల్‌ఫోన్‌ను అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డీఐజీగా ఉన్న పరమ్‌బీర్ సింగ్ ధ్వంసం చేశారంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. అవిప్పుడు కలకలం రేపుతున్నాయి.
26/11 ఉగ్రదాడి దోషి మహ్మద్ అజ్మల్ కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ధ్వంసం చేశారని రిటైర్డ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ పఠాన్.. ఈ ఏడాది జులై నెలలో ప్రస్తుత ముంబై పోలీసు కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. పఠాన్ నాలుగు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ, గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన అవినీతి కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సింగ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరవడంతో తాజాగా తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో అవినీతి ఆరోపణలపై పరమ్‌బీర్ సింగ్‌ను ముంబై పోలీసు చీఫ్ పదవి నుంచి తొలగించగా.. తాజాగా ఆయనపై కసబ్ సెల్‌ఫోన్ ధ్వంసం ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
కసబ్ నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఆ ఫోన్‌ను కానిస్టేబుల్‌కు అప్పగించామని డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎన్‌ఆర్ మాలీ తనకు తెలియజేసినట్లు పఠాన్ ఫిర్యాదులో తెలిపాడు. అప్పటి డీఐజీ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్)గా ఉన్న పరమ్‌బీర్ సింగ్.. కానిస్టేబుల్ నుంచి మొబైల్ ఫోన్ తీసుకున్నారని మాజీ పోలీసు అధికారి పఠాన్ ఆరోపించారు. ‘‘26/11 ముంబై ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారి రమేష్ మహాలేకు సింగ్ ఫోన్‌ను అందజేయాల్సి ఉందని, అయితే అతను ముఖ్యమైన సాక్ష్యాన్ని ధ్వంసం చేశాడు’’ అని పఠాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.