భూమిలో నుంచి పైకి వచ్చిన బావి.. తిరుపతిలో వింత ఘటన!
posted on Nov 26, 2021 11:31AM
టెంపుల్సిటీ తిరుపతిలోని శ్రీకృష్ణనగర్లో వింతఘటన జరిగింది. భూమిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా భూమిపైకి వచ్చేసింది. శ్రీకృష్ణనగర్లోని ఓ ఇంటి ఆవరణలో 25 అడుగుల లోతులో 18 సిమెంట్ వరలతో ట్యాంకు నిర్మించుకున్నారు. ఆ ట్యాంక్లోని సిమెంట్ వరలు 11 అడుగుల మేర నిట్ట నిటారుగా బూమిపైకి వచ్చేశాయి. ఈ వింత సంఘటనను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏమి జరుగుతుందో అని ఒక్కసారిగా వారంతా భయాందోళనకు గురయ్యారు.
ముందుగా వాటర్ ట్యాంక్ సమీపంలో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ వెంటనే ట్యాంకులోని వరలు ఉన్నవి ఉన్నట్లు పైకి వచ్చేశాయని ఇంటి యజమానురాలు చెప్పారు. దీంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాను ట్యాంకు లోపలికి దిగి శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. వరలు ఒక్కసారిగా పైకి వస్తుండడంతో తాను బయటకు వచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఆ క్రమంలో తనకు స్వల్ప గాయాలు తగిలాయని చెప్పారు. ఒక్కసారిగా ట్యాంకు పైకి లేస్తుండడంతో ఎంతో భయపడ్డానని, సాయం కోసం పెద్దగా కేకలు వేశానని ఆమె చెప్పారు.
భూమిలోపలి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్ చెక్కు చెదరకుండా నిటారుగా నిలిచి ఉంది. ఇది సహజ పరిణామమే అని అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షాల వల్ల భూమి లోపలి పొరలు బాగా నానిపోయి, వాటర్ ట్యాంక్ ఉబికి వచ్చిందని వారు అంటున్నారు. భారీ వర్షాల కారణంగానే ఈ వింత సంఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.