కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు.

ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు. 
అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు.

కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu