నందమూరి కుటుంబానికి మూడో ప్రమాదం..
posted on Dec 6, 2014 7:39PM

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ దుర్మరణం పాలయ్యారు. నందమూరి కుటుంబీకులు ఇప్పటికి మూడుసార్లు భారీ రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. చాలా సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు కుమారుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మెదడుకు తీవ్ర గాయం తగిలింది. ఆయన ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నారు. అదృష్టవశాత్తూ ఆయన ప్రమాదం నుంచి త్వరగా కోలుకున్నారు. అయితే ఆయన ఇప్పటికీ ఆ ప్రమాదం తాలూకు చేదు ఫలితాలను అనుభవిస్తూనే వున్నారు. మెదడుకు దెబ్బ తగిలిన కారణంగా ఆయన ఒక కాలు, చేయి స్వాధీనం తప్పాయి. ఆయన అప్పటి నుంచి అలాగే వున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వస్తున్న ఆయన కారు భారీ ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆయన ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు మరోసారి నందమూరి కుటుంబీకుడికి రోడ్డు ప్రమాదం ఎదురైంది. ఈ ఘోర ప్రమాదంలో నందమూరి జానకిరామ్ దుర్మరణం పాలయ్యారు.