మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రికి కేంద్రప్రభుత్వం క్లియరెన్స్
posted on Oct 7, 2015 2:47PM
.jpg)
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 68సం.లు పూర్తయ్యాయి. రాష్ట్ర విభజన జరిగి ఆంద్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 15నెలలు పూర్తయ్యాయి. గత 68 సం.లలో రాష్ట్రానికి ఎన్నడూ మంజూరు కానన్ని ఉన్నత విద్యా వైద్య సంస్థలు కేవలం ఈ 15నెలలు కాలంలో మంజూరు అవడం విశేషం. రాష్ట్ర విభజన చట్టంలో హామీని నిలుపుకొంటూ కేంద్రప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో మంగళగిరిలో నెలకొల్పబోతున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో 193 ఎకరాల భూమిని సిద్దంగా ఉంచింది. వీలయితే ఈ నెల 22నే దానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేత శంఖుస్థాపన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆంద్రప్రదేశ్ తో బాటు దేశంలో మరో మూడు రాష్ట్రాలలో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఈరోజు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖలో ఐ.ఐ.ఎం., మంగళగిరిలో ఎయిమ్స్, చిత్తూరులో ఐ.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్., తాడేపల్లి గూడెంలో ఎన్.ఐ.టి. వంటి ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఒకే సం.లో ఒక రాష్ట్రానికి ఇన్ని ఉన్నత సంస్థలు మంజూరు కావడం దేశ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ జరుగలేదు. త్వరలో పెట్రోలియం, గిరిజన యూనివర్సిటీ వంటి వాటిని ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం అవసరమయిన కసరత్తు చేస్తోంది.