టెక్నాలజీ పై అతిగా ఆధారపడితే చీకటే గతి ..
posted on Dec 15, 2020 10:57AM
టెక్నాలజీ అభివృద్ధితో మనిషి కాలు బయట పెట్టకుండానే అన్నీ అతను కోరుకున్న చోటికే వచ్చి చేరుతున్నాయి. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో మనిషి కూర్చున్న చోటు నుండి కదలకుండానే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అదుపు చేయగలుగుతున్నాడు. అయితే ఇది కేవలం నాణానికి ఒక వైపు మాత్రమే. కానీ దీనికి మరో వైపు కూడా ఉంది.
అదేంటంటే.. నిన్న సోమవారం సాయంత్రం ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సేవలు కొంత సమయం నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో మనం నిత్యం ఉపయోగించే యూట్యూబ్‌తో పాటు జీమెయిల్, గూగుల్ వర్క్ స్పేస్, సెర్చ్ ఇంజిన్ తో సహా అన్నీ ఆగిపోయాయి. దీంతో కోట్లాది మంది యూజర్లు ఆ సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇదే సమయంలో గూగుల్ ప్లే, గూగుల్ మీట్, గూగుల్ క్లాస్‌రూమ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ హ్యాంగౌట్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డాక్స్‌లో కూడా సమస్యలు వచ్చాయి. అయితే ఒక గంట తర్వాత గూగుల్ ఈ సమస్యను పరిష్కరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే గూగుల్ సేవలు నిలిచిపోయిన టైం లో సమస్య తీవ్రత ఎలా ఉందొ తెలియ చేస్తూ ట్విట్టర్‌లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్ తాజాగా విపరీతంగా వైరల్ అయ్యింది. "గూగుల్ సేవలలో అంతరాయం ఏర్పడినప్పుడు నా ఇంట్లో చీకటి ఏర్పడింది. దీంతో నేను చీకట్లో ఉండి పోవాల్సి వచ్చింది" అని ఆ యూజర్ కాప్షన్ పెట్టాడు. అదేంటి గూగుల్ సేవలు నిలిచిపోతే ఇంట్లో చీకటి ఉండడమేమిటి అని మనకు అనుమానం రావచ్చు.
ఇప్పటికే చాలామంది ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ గూగుల్ అసిస్టెంట్‌తో కనెక్ట్ అయి ఉన్నాయి. అలా కనెక్ట్ చేయించుకున్న వారు... తమ ఇంట్లో లైట్లు వెలగాలన్నా, ఏసీ ఆన్ అవ్వాలన్నా... అన్నీ గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఆ పని చేయించుకుంటున్నారు. దీనికోసం కొన్ని రకాల గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఒక వేళ గూగుల్ ప్లే స్టోర్ పనిచెయ్యకపోతే... ఈ యాప్స్ కూడా పనిచెయ్యవు. దాంతో... ఇళ్లలో దీనిపై ఆధారపడి పనిచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పనిచేయవు. ప్రతి పనికి టెక్నాలజీపై ఆధార పడటం అంత మంచిది కాదని ఎపుడో పెద్దలు చెప్పిన మాట నిజమవుతోంది అంటున్నారు అనుభవజ్ఞులు.
తాజాగా బ్రౌన్ అనే ఆ యూజర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను గూగుల్ హోమ్ (Google Home) వాడుతున్నట్లు తెలిపాడు. ఇదో ఒక రకమైన ఫస్ట్ జనరేషన్ స్మార్ట్ స్పీకర్. ఇది గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ద్వారా కంట్రోల్ అవుతుంది. దీన్ని వాడే వారు దీనికి ఏం ఆర్డర్ ఇస్తే... స్పీకర్ ద్వారా ఆపని చేసి పెడుతుంది. మనకు కావలసిన వాతావరణ వివరాలు చెబుతుంది. ఆన్‌లైన్‌లో వస్తువులకు ఆర్డర్ ప్లేస్ చేస్తుంది, లైట్లను వేయడం, తీయడం.. లాంటివి చాలా చెయ్యగలదు.
ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యే వస్తువులన్నింటినీ గూగుల్ హోమ్ కనెక్ట్ చేసుకోగలదు. ఇది గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ తీసుకుని పనిచేస్తుంది. అయితే గూగుల్ సర్వీసులు ఆగినప్పుడు మాత్రం గూగుల్ హోమ్ కూడా ఆగిపోయింది. దీంతో... బ్రౌన్ ఇంట్లో లైట్లు కూడా వెలిగే పరిస్థితి లేకుండా పోయింది.
బ్రౌన్ గూగుల్ పై ఆధారపడకుండా ఉండి ఉంటే... తన ఇంట్లో లైట్లను తానే ఆన్ చేసుకుని, తానే ఆఫ్ చేసుకునేవాడు. గూగుల్ సర్వీసులను వాడుకోవడం వల్ల అవి ఆగిపోయే సరికి... ఇంట్లో లైట్లు కూడా వెలిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా ప్రతి పనికి స్మార్ట్ వస్తువులతో కనెక్ట్ చేసుకునేవారికి ఇదో పెద్ద హెచ్చరికే అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. మనిషి సౌకర్యం కోసం టెక్నాలజీని వాడటం మంచిదే కానీ... అది లేకపోతే పూర్తిగా పనులు ఆగిపోయేలా దానిపై ఆధారపడ వద్దంటున్నారు. కనీసం స్విచ్చులు, లైట్ల వంటివైనా సొంతంగా వేసుకోమని వారు సూచిస్తున్నారు. దీనివల్ల మనకు కొంత వ్యాయామం కూడా అవుతుందని... మన ఆరోగ్యం కూడా బావుంటుందని నిపుణులు చెపుతున్నారు. టెక్నాలజీపై ఇంతగా ఆధారపడిన బ్రౌన్ వంటివాళ్ళు ఈ విషయంపై మరోసారి ఆలోచించుకోవాలని నెటిజన్లు చెప్పడం వెనక ఉద్దేశం కూడా ఇదే. గూగుల్‌లో ఒక గంటపాటు వచ్చిన ఓ చిన్న టెక్నికల్ ప్రోబ్లం.. ఇంత పెద్ద సమస్యకు కారణమైంది. అయితే సర్వీసులు త్వరగానే తిరిగి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సరిపోయింది.. అదే కొన్ని గంటలపాటు సర్వీసులు నిలిచిపోతే ఎంత ఇబ్బంది అవుతుందో ఊహించడం కూడా కష్టమే అని అంటున్నారు నిపుణులు.