నలంద కిషోర్ మృతి.. పోలీసులు చేసిన హత్యగానే భావించాలి
posted on Jul 25, 2020 1:09PM
వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ సానుభూతిపరుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మృతి చెందడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ.. కిషోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ఆరోగ్యం బాగాలేకపోయినా కిషోర్ ను విశాఖపట్నం నుంచి కర్నూలుకు తీసుకెళ్లారని.. కిషోర్ ను తరలించిన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కిషోర్ కరోనాతో చనిపోయారని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యగానే భావించాలని విమర్శించారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. ఆయన పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే కాబట్టి, బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
"చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. పొలిటికల్ పంచ్ అంటూ వైసీపీ సభ్యుడు ఒకరు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే తప్పేంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. మనం కూడా ఇలాగే చేస్తే ఎలా? ఇంతకు ముందు రంగనాయకమ్మ విషయంలోనూ పోలీసుల తీరు బాగోలేదు. రోజురోజుకీ ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పోలీసుల తీరును సీఎం జగన్ నిరసించాలి" అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.