పారిశ్రామిక పితామహుడు.. వేలాది కుటంబాల్లో వెలుగులు.. ముళ్లపూడికి శతకోటి వందనాలు 

నిలువెత్తు తెలుగుదనం, కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షల ప్రతిరూపం డాక్టర్ ముళ్ళపూడి సత్యహరిశ్చంద్రప్రసాద్. ఆంధ్రా పారిశ్రామికరంగ పితామహుడు, పారిశ్రామిక భగీరధుడుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్  దక్షిణ భారత దేశంలో "ఆంధ్రా బిర్లాగా" సుపరిచితులు.  ఆంధ్రషుగర్స్ ఆంధ్రాపెట్రోకెమికల్స్  లాంటి ఎన్నో వ్యవసాయ ఆధారిత భారీ పరిశ్రమల స్ధాపన ద్వారా, ఆంధ్ర పారిశ్రామిక రంగానికి మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పునాదులు వేసి, రాష్ట్రంలో మెుదటితరం పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్. 

పారిశ్రామిక అంతరిక్ష  రాకెట్  ఇంధన  తయారీ ద్వారా  భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన సగర్వంగా చేర్చారు. తణుకును పారిశ్రామిక పట్టణంగా తీర్చిదిద్దారు. ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యంగా ఉభయగోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్టణం, రాయలసీమలలోనే కాక.. దేశంలోనే పలు చోట్ల కొన్ని వేల, లక్షల కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి మరియు విద్యావకాశాలు కల్పించి వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆదర్శమూర్తి డాక్టర్ సత్యహరిశ్చంద్రప్రసాద్. 

పశ్చిమగోదావరి జిల్లా కోస్తాంధ్ర ఉండ్రాజవరం సంస్ధానాధీశులు, తణుకు ముళ్ళపూడి జమిందారుల వంశంలో.. ఆంధ్రభోజ, సాహితీ వల్లభ, కళాప్రపూర్ణ కీ.శే. ముళ్ళపూడితిమ్మరాజు- వెంకటరమణమ్మ దంపతులకు 1921లో జన్మించారు సత్యహరిశ్చంద్రప్రసాద్. చిన్నతనం నుండే ఆయన తాతగారు, ఉండ్రాజవరం సంస్ధానాధీశులు, "రైతురాయడు" గా ప్రసిధ్ధి గాంచిన ముళ్ళపూడి వేంకటరాయుడు అడుగుజాడల్లో నడిచారు.  ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాతగా ప్రసిధ్ధి పొందారు. తాత తండ్రుల వారసత్వంగా గాంధీజీ సిధ్ధాంతాలపై ఆశక్తి పెంచుకొన్న ముళ్ళపూడి..స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని సమరయోధుడిగానిలిచారు. 

పాఠశాల విద్య (ఎస్ఎస్ యల్ సి) పూర్తి చేసిన హరిశ్చంద్ర ప్రసాద్ దేశానికి స్వాతంత్ర్యము రావడానికి నాలుగు రోజుల ముందు (ఆగస్ట్ 11, 1947) తణుకు లో ఆంధ్రా సుగర్స్ స్థాపించారు. గ్రామీణభారతాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల సహాయంతో పారిశ్రామికంగా అభివృధ్ధి చేసి విద్యా ఉద్యోగ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరాన్ని ఆయన చిన్నతనంలోనే గుర్తించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపారు. గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ ఇది.  

 గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడ సమ్మె జరగలేదంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రా షుగర్స్ లో ప్రస్తుతం 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 1947లో రోజుకి 600 టన్నుల చెరకు ఒత్తబడి తో మొదలయ్యి.. ప్రస్తుతము 10,000 టన్నులు చేరింది. రాష్ట్ర ప్రభుత్వమునకు అత్యధిక పన్ను చెల్లించు పరిశ్రమ కూడా ఇదే.  దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ కూడా ఇదే. అంతేకాదు ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత సత్య హరిశ్చంద్రప్రసాదే. భారత దేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము కూడా ఆయన నెలకొల్పిందే. 

పశ్చిమగోదావరి జిల్లాలోని  తణుకును పారిశ్రామిక పట్టణంగా తయారుచేసి ప్రపంచ పటంలో నిలిపారు. దేశ విదేశాలు పయనించి శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రగతిని అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో  అగ్రభాగాన నిలిపిన ఘనత ఆంధ్రాబిర్లా శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాదే. ఈ అభివృధ్ధి నమూనానే నేటి తరం నాయకులు అవలంబిస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ రంగంలో ఎన్నో విశిష్ట పదవులను అలంకరించారు ముళ్ళపూడి సత్యహరిశ్చంద్రప్రసాద్. ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందారు. తాత వెంకట్రాయుడు, తండ్రి తిమ్మరాజు గారి అడుగు జాడల్లో నడిచి.. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీలు, వృధ్ధాశ్రమాలు స్ధాపించి సమాజానికి ఎంతో సేవచేసారు. ఆంధ్రుల పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాన్ని అంతరిక్ష స్ధాయికి చేర్చిన మహనీయుడు డాక్టర్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కు  శత జయంతి సందర్భంగా ఘన నివాళులు..