బొమ్మలాట కాదు .. బొమ్మైకి కత్తిమీద సామే..

కర్ణాటక రాష్ట్రంలో సుమారు రెండు నెలలకు పైగా సాగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడింది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో 12 మంది కేంద్ర మంత్రులకు ఇట్టే  ఉద్వాసన పలిగిన బీజేపీ కేంద్ర నాయకత్వం, కర్ణాటక ముఖ్యమంత్రి పదవినుంచి బీఎస్ యడ్యూరప్పను తప్పించేందుకు మాత్రం చాలా చాలా కసరత్తే చేసింది. వ్యూహాలను పన్నింది. పావులు కదిపింది. చివరకు ఎలాగైతేనేమి, 78 ఏళ్ల యడ్డీని అదే వయసు వంకగా చూపించి సగౌరవంగా సాగనంపింది. ఆయన సోమవారం  ‘స్వచ్చందంగా’, తమ పదవికి రాజీనామా చేశారు.అక్కడి నుంచి 24 గంటలు తిరగక ముందే అధిష్ఠానం ఆదేశం మేరకు, బీజేపీ శాసన సభాపక్షం కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మైని ఎన్నుకుంది. ఈయన మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ నాయకుడు ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. ఆయన బుధవారం రాష్ట్ర 20 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ వ్యవహరంలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.నాయకత్వ మార్పును సాఫీగా కానిచ్చింది. అలాగే, యడియూరప్ప వారసుడి ఎంపిక ప్రక్రియను కూడా హేండిల్ విత్ కేర్  అన్నట్లుగా చాలా సున్నితంగా కానిచ్చింది.  

అయితే ఇల్లలకగానే పండగ కాదు, అన్నట్లుగా యడ్యూరప్పను తప్పించడంతోనే కథ సుఖాంతం అయినట్లు కాదు, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. యడ్యూరప్ప రెండేళ్ళ పాలన మిగిల్చిన మరకలు ఒక వైపు, ఆయన నీడ మరొక వైపు కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని వెంటడుతూనే ఉంటాయి. అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, బొమ్మైను సెలెక్ట్ చేసింది యడ్డీనే కావడం, ఇద్దరూ ఒకే  (లింగాయత్) సామాజిక వర్గానికే చెందినవారు కావడం ఇటు కొత్త ముఖ్యమంత్రికి, అటు పార్టీ అధిష్ఠానికి కూడా కొంత ఊరట ఇచ్చే, అంశంగానే పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసిన రావడం పట్ల ఆగ్రహంగా ఉన్న యడ్డీని అలాగే, ఆయన కంట కన్నీరు చూసి కరిగిపోయి, బీజేపీని శపించిన లింగాయత్ సామాజిక వర్గాన్ని బుజ్జగించెందుకే,అదే సామాజిక వర్గానికి చెందిన బొమ్మైని అధిష్ఠానం ఎంపిక చేసిందని, పరిశీలకులు భావిస్తున్నారు.మరో వంక  జనతా పరివార్‌కు చెందినవారు కావడం, యడ్డికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొంది అధిష్ఠానం పెద్దలతోనూ సత్సంబంధాలు కలిగివుండడం, బీజేపీలో సౌమ్యుడిగా గుర్తింపు పొందడం, లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందడం వంటి అంశాలన్నీ బొమ్మైకు కలిసొచ్చాయని భావిస్తున్నారు. 

అయితే, కొత్త ముఖ్యమంత్రి ముందున్న సవాళ్ళు సామాన్య మైనవి కాదు. మరో 18 నెలల్లో శాసన సభ ఎన్నికల పెద్ద పరీక్షకు పార్టీని సిద్ధం చేయడం సామాన్యమైన విషయం కాదు.కొవిడ్ 19, వరదలు, మరో వంక ఆర్థిక వ్యవహారాలు ఇలా అన్ని దిక్కులా నుంచి సమస్యలు, సంక్షేమాలు కళ్ళురుముతున్నాయి. అలాగే, రాజకీయంగానూ, బొమ్మై ముందు చాలానే సమస్యలున్నాయి. యడ్యూరప్ప రెండేళ్ళ పాలనలో అవినీతి అరోపణలురాని  రోజంటూ లేదు. అది కూడా ప్రతిపక్షాల నుంచి కాదు,సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే యడ్డీకి వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు.అలాగే, యడ్డీ చిన్న కొడుకు విజయేంద్ర ప్రభుత్వ వ్యవహరాలలో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలున్నాయి. నిజానికి యడ్డీ ఉద్వాసనకు ఇవ్వన్నీ కూడా కారణమయ్యాయి.అదే విధంగా కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు యడ్డీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణ వుంది. ఈ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ ... మరో వంక సిద్దరామయ్య, డీకే శివకుమార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులకు దీటుగా రాజకీయాలు చేయడం కొత్త ముఖ్యమంత్రి బొమ్మైకి కత్తి మీద సాముగానే పరిశీలకులు భావిస్తున్నారు.