తెలంగాణ‌కు ఏపీ హెల్పింగ్ హ్యాండ్‌.. దొందుదొందేన‌ని క్లియ‌ర్‌..

పైపైన తిట్టుకుందాం.. కొట్టుకుందాం.. జ‌నాన్ని ప‌రేషాన్ చేద్దాం. లోలోనా మాత్రం మ‌నం మ‌నం ఒక్క‌టే అన్న‌ట్టు ఉందాం. ఇదే ఇప్పుడు ఇద్ద‌రు సీఎంలు ఫాలో అవుతున్న ఫార్ములాగా ఉంది. జ‌గ‌జ‌గ‌డంపై రెండు రాష్ట్రాలు క‌త్తులు దూస్తున్నాయి. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర పోలీసుల‌ను మోహ‌రిస్తున్నాయి. కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. మంత్రులు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇక స‌మ‌ర‌మే అన్న‌ట్టు తెగ సీన్ క్రియేట్ చేస్తున్నారు. క‌ట్ చేస్తే.. ఒక‌రికొక‌రు తోడుగా ఉంటున్నారు. ప‌ర‌స్ప‌రం సాయం చేసుకుంటున్నారు. తాజాగా, ఏపీ స‌ర్కారు త‌న మిత్రుడైన కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఓ సాఫ్ట్‌వేర్ షేర్ చేసింది. రాబోవు ఫ్రెండ్‌షిప్ డేకి ముందే గిఫ్ట్ ఇచ్చిన‌ట్టుంది. 

తెలంగాణకు జగన్ సర్కార్ సాయం అందించింది. ‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 'మన బడి', 'నాడు-నేడు' సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉప‌యోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నా.. ఏపీ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ అడ‌గ‌డం.. అందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సిద్ధ‌మ‌వుతోంది. ఆ ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏపీ ద‌గ్గ‌ర ఉన్న‌ నాడు–నేడు సాఫ్ట్‌వేర్‌ ప్రయోజనకరంగా ఉంటుందని.. తాము కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటామని.. దీనిపై నిరభ్యంతర ఉత్తర్వులివ్వాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు కార్య‌క్ర‌మ‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌ముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ త‌యారు చేసిన‌ ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్‌ను ఏపీ ప్రభుత్వం వినియోగిస్తోంది. ఎన్ని పనులు చేపట్టారు? ఎన్ని పనులు పూర్తయ్యాయి? ఎన్ని నిధులు ఖర్చయ్యాయి? తదితర అంశాలన్నీ తెలిసేలా ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌నే  తాజాగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంత‌రం మేర‌కు ఆ రాష్ట్రానికి అందిస్తోంది ఏపీ స‌ర్కారు. 

ఇక్క‌డ మేట‌ర్‌.. సాఫ్ట్‌వేర్ సాయంకంటే కూడా రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స్నేహాం గురించే ఎక్కువ చ‌ర్చ న‌డుస్తోంది. పైకి రెండు ప్ర‌భుత్వాలు వాట‌ర్ ప్రాజెక్టుల‌పై పోట్లాడుకుంటున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. లోలోప‌ల మాత్రం మంచి ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతోంద‌ని.. సాఫ్ట్‌వేర్ సాయ‌మే అందుకు ఎగ్జాంపుల్ అని అంటున్నారు. మ‌రెందుకో పైకి ఆ వాట‌ర్ వార్‌ డ్రామా? ప్ర‌జ‌ల భావోద్రేకాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ఎందుకో? అని మండిప‌డుతున్నారు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు.