కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం : ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక నా ఫోన్ ట్యాప్ చేశారని ఆయన అన్నారు. మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. 

నా ఫోను, నా భార్య ఫోను ట్యాప్ చేసి బెదిరించారని కొండా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్‌లకు కఠిన శిక్ష విధించాలని విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రస్తావించి, జాతీయ స్థాయిలో చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సమగ్రంగా నిరూపించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.