ఏపీ పర్యాటక అభివృద్ధికి చర్యలు : సీఎం చంద్రబాబు

 

ఏపీలో టూరిజం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ‌ జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్‌లో పర్యాటక క్యారవాన్లను ఆయనతో కలిసి ప్రారంభించారు. భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే అని ఎప్పుడో చెప్పా ఈ రంగంలో అనేక ఉద్యోగాలోస్తాయి ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ పర్యటక శాఖకు సలహాదారుగా ఉండాలని యోగా గురువు రాందేవ్ బాబాను  చంద్రబాబు కోరారు. ముప్పై సంవత్సరాలు రాందేవ్ బాబా తనకు తెలుసని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. సోషలిజం, కమ్యూనిజానికంటే టూరిజానికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందన్నారు.

 ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయని, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. 1000 కిలో మీటర్లకు పైగానే సముద్ర తీరం ఉందని, అలాగే ఫారెస్ట్ సైతం ఉన్నాయని ఆయన చెప్పారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో యోగాంధ్ర నిర్వహించామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారంలో అనుమతులు వెంటనే ఇస్తున్నామని, రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విశాఖ, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.అంతకు ముందు ప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. 

విజయనగరం జిల్లాలో వందల కోట్ల రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ స్వయంగా జిల్లాలో పర్యటించి, పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు.విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని చినరావుపల్లి గ్రామంలో 172 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నెలకొల్పనున్నట్లు బాబా రాందేవ్ మీడియాకు వివరించారు. ఇక్కడ భారీ స్థాయిలో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.