రాశి ఫలాలు కాదు - మన రాత మన చేతుల్లోనే !

దాదాపు చాలా మందికి ఓ అలవాటు ఉంటుంది. ప్రతి వారం ఆదివారం రాగానే సండే బుక్స్ లోనో, లేక టీవీ లో స్వామిజీలు చెప్పేవో లేక మొబైల్ లోనే లభ్యమయ్యే బోలెడు మ్యాగజైన్ లలోనో రాశి ఫలాలు చూసుకోవడం. అందులో తమ రాశి ఫలం ఎలా ఉందో చూసుకుని ఆ వారానికి మంచిగా ఉంటే ఇక ఉల్లాసంగా మారిపోవడం. ఏదైనా నష్టమో, అనారోగ్యమో కలుగుతుందని ఉంటే ఇక నిరాశ పడిపోయి, పరిహారాల కోసం, అవి ఇవి చేయించడానికి అంటూ ఖంగారు పడిపోతూ ఉంటారు. 

నమ్మకాలు మంచివే కావచ్చు కానీ మరీ ఇలా ప్రతి వారం వారం, బి అలర్ట్ అన్నట్టు ఠంచనుగా వాటిని చెక్ చేసుకొని ఉన్న ఉత్సాహాన్ని నీరు గార్చుకోవడం అవసరమా?? 

రోజులు మారినా, కాలం మారినా, గ్రహాలు మారినా మనిషి దృఢసంకల్పం అలాగే ఉండాలి కానీ, ముఖ్యమైన దృఢసంకల్పం మారిపోతే రాశి ఫలాలు మాత్రమే కాదు, జాతకాలు, గండాలు, సుడిగుండాలు అన్ని కూడా కట్టకట్టుకుని మీ మీదకు వచ్చినట్టు ఉంటాయి. అవునా??  కాదా?? ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే!!

ఏదైనా సమస్య వస్తేనో, లేక ఇబ్బందులు ఎదురైతేనో వెంటనే రాశి ఫలాలు, గ్రహాల తీరు చూస్తూ కూర్చుంటారు చాలా మంది. మరికొందరేమో ఏకంగా ఎక్కడో ఉన్న స్వామిజీలకు ఫోన్ లు చేసి పరిస్థితులు చెప్పుకుని జేబులు ఖాళీ చేసుకుంటారు. ప్రశ్నాపత్రం చేతిలో ఉంటే మీరు రాయాల్సింది జవాబులు మాత్రమే కాదు  మొదట ప్రశ్నను అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు మీ స్థితి గతులను మీరు ప్రశ్నించుకుని వాటిని అర్థం చేసుకుంటే సమాధానం కూడా చాలా సులువుగా దొరుకిపోదూ!!

అందరూ అంటూ ఉంటారు ఏది ప్లాన్ చేసినట్టు జరగదు అని. కానీ ఎందుకు జరగదు?? అసలు ఎప్పుడైనా ఒక్కరోజును అయినా ప్లాన్డ్ గా మలిచి చూసారా?? 

ఉదయం లేవగానే ఈ రోజు ఈ పనులు చేయాలి అని ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టు సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాగితే ఆ రోజు నిద్రపోయే ముందు మీరోజు గడిచిన విధానాన్ని చూస్తే కచ్చితంగా కళ్ళలో మెరుపు మెరవడం ఖాయం!! పూర్తి కాకపోయినా 90 శాతం మీ ప్రాణాలిక అమలవుతుంది. ఒకవేళ మొదటిసారి ఫెయిల్ అయ్యారా?? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కాలంతో ప్రయాణం చేయడం ఎంతో మంది చేస్తారు కానీ, ఒక్కసారి కాలాన్ని గుప్పెట్లో పెట్టుకుని దాన్ని శాసించడం నేర్చుకుంటే జీవితాన్ని నచ్చినట్టు మలచుకోవచ్చు. 

రాశి ఫలాలు, రంగులు, అనుకూల దిశ ప్రయాణాలు, రాహు కాలం, యమగండం ఇవన్నీ నమ్మచ్చు, నమ్మక పోవచ్చు కానీ జీవితం మీద,  ముఖ్యంగా  భవిష్యత్తు మీద వీటి ప్రభావం ఎంత అంటే, వాటి పేరుతో ఎవరికి వారు చేసే నిర్లక్ష్యం, కాలయాపన, అన్నిటికి మించి అతి విశ్వాసం, వీటి వల్ల ఎన్నో కలల పార్శ్వాలు అంచుల నుండే జారిపోతాయి.

అందుకే మరి రాశిఫలాల రాతలు వదిలి ఎవరి పలితాలు వారు రాసుకోవడానికి ప్రయత్నించండి. జీవితం ప్రశ్నలు సందిస్తూనే ఉంటుంది మరి!!

◆  వెంకటేష్ పువ్వాడ

 

Related Segment News