ఈ  విషయాలు  ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ చెప్పకూడదు!

 

మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే..


ఆర్థిక స్థితి..

ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు.

ఇంటి సమస్యలు..

ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు.


రిలేషన్ గొడవలు..

 నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు.


బలహీనతలు..

ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు.

ప్రణాళికలు..

పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.


                                                     *రూపశ్రీ.