ఇది చదివితే ఉద్యోగం గ్యారెంటీ!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి?? 

ఎంపిక:

కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి. 

నాట్ ఓన్లీ దట్:

ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే.

మరింకేం కావాలి??

నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి.

స్పృహ కలిగి ఉండాలి:

ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం.

స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు:

కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది. 

ముందుగా మరింత ఉత్సాహంగా:

ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది. 

ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్:

మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.

 సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!!

◆ వెంకటేష్ పువ్వాడ