దొంగిలించబడని ఆయుధాన్ని దర్జాగా చేతబట్టాలి!

యుద్ధమూ శాంతి, రెండు విరుద్ధమైన విషయాలు. కానీ జీవితంలో యుద్ధమూ, శాంతి రెండూ ఎంతో ప్రాధాన్యత గల విషయాలు. మనిషి జీవితం నిరంతరం యుద్ధమే. తనతో తను, సమాజంతోనూ, ఎన్నో విషయాలతోనూ. కానీ ఎక్కువ మంది యుద్ధం చేసేది పేదరికంతోనూ, ఆకలితోనూ. ఇది జగమెరిగిన వాస్తవం.

కలలు, కోర్కెలు, అందని తీరాలను అందుకోవాలనే ఆరాటాలు ఇవన్నీ సగటు మనిషి జీవితంలో ఉన్నా వాటిని నెరవేర్చుకోవడానికి కొన్ని ఇబ్బందులు అడ్డొస్తూ ఉంటాయి. ఇలా అడ్డొచ్చే వాటిలో చాలా వరకు పేదరికం, ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి.  అయితే చాలామంది వాటన్నిటినీ అందని ద్రాక్షగానే చూస్తారు. అందుకోవాలనే ప్రయత్నాలు చేసినా అవన్నీ ఇతరుల సహాయంతోనో, లేక ఎవరో ఒకరు దయతలచి వాటిని అందుకుని తమకు ఇస్తారనో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సహాయాలు అన్ని తాత్కాలికమైనవే అనే విషయం వాళ్లకు భోధపడదు. ఎందుకంటే జీవితానికంటూ సరైన లక్ష్యం, జీవితం మీద సరైన అవగాహన అసలు ఉండటం లేదు ఎవరికి. 

మనిషి ఎంత శారీరకంగా కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎన్ని భవంతులు కట్టినా చెడ్డ కాలం వస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. ఇక్కడ చెడ్డ కాలం అంటే ఏ గ్రహాలో శాపాలు పెట్టడం కాదు. చేసే వ్యాపారం, ఆర్థికపరమైన కార్యకాలాపాలలో ఘోరమైన నష్టాలు రావచ్చు అని అర్థం. అలాంటివి ఎదురైతే మళ్ళీ చేసేది ఏంటి?? శారీరక కష్టం నుండి మొదలు పెట్టడమా?? 

కష్టం మంచిదే మనిషికి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతుంది. కానీ కష్టానికి తోడు ఒక ఆయుధం కావాలి. ఎవ్వరూ దొంగిలించని ఆయుధం కావాలి. బుద్దికి పదును పెట్టి కష్టాన్ని తగ్గించి సులభ సాధ్యమయ్యే దారులవైపు అందర్నీ నడిపించే ఆయుధం కావాలి. 

దొరలు దోచలేరు దొంగ లెత్తుకపోరు

భ్రాతృజనము వచ్చి పంచుకోరు

విశ్వవవర్ధనంబు విద్యాధనంబురా

లలిత సుగుణజాల తెలుగుబాల.

ప్రముఖ రచయిత, కరుణశ్రీ గా పేరొందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల శతకంలో ఇలా చెబుతారు…..

విద్య అనే సంపదను దొరలు అంటే ధనవంతులు, చాకిరీ చేయించుకునేవాళ్ళు దోచుకోలేరు, దొంగలు కూడా దొంగలించలేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వచ్చి దాన్ని ఆస్తిని పంచినట్టు  పంచుకోరు. అలా ఎవ్వరికో దాసోహం కాకుండా మనవెంటే ఉండి మనతో ఉండేది కేవలం విద్య మాత్రమే. ఈ  ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది కూడా విద్య మాత్రమే!

ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో మనిషిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగేది, ఆలోచనా పరంగా మనిషి స్థాయిని పెంచి గొప్ప శక్తిగా ఎదగడానికి తోడ్పడేది కేవలం విద్య  మాత్రమే. ధనిక పేద తారతమ్యాలు విద్యను అభ్యసించడానికి ఖర్చు చేయడంలో ఉంటుందేమో కానీ, ప్రస్తుతం ఉంటున్న విద్యావకాశాలతో పేదవాడు కూడా సువర్ణాక్షరాలతో ఈ చరిత్రలో లిఖించబడే విధంగా ఖచ్చితంగా తయారవగలడు. కావలసిందల్లా సంకల్ప బలం. 

ఆ సంకల్ప బలంతో విద్య అనే ఆయుధాన్ని చేత బడితే జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకు అయినా సవాల్ విసరచ్చు!!

సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ సందర్బంగా అక్షరాన్ని ఆయుధం చేసుకునే వారి సంఖ్య పెరగాలని, అందుకు అందరమూ తగిన కృషి చేయాలని కోరుకుంటూ……  అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ

◆ వెంకటేష్ పువ్వాడ