మోడీ పాకిస్థాన్‌కి వెళ్ళడం కరెక్టేనా?



భారత ప్రధాని నరేంద్రమోడీ తాను పదవిలో వుండగానే ప్రపంచ దేశాలన్నిట్నీ చుట్టేయాలని కంకణం కట్టుకున్నట్టుగా వుందన్న విమర్శలు వినిపిస్తున్నప్పటికీ మోడీ ప్రధాని హోదాలో ప్రపంచ పర్యటన చేసే విషయంలో ఎంతమాత్రం వెనకడుగు వేయడం లేదు. మోడీ నిన్ననే రష్యాకి వెళ్ళారు. అటు నుంచి అటే ఆఫ్ఘనిస్థాన్‌లో పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం ఇండియాకి తిరిగి వచ్చేసి, క్రిస్మస్ రోజున 91వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలి. అయితే మోడీ ప్రోగ్రామ్‌లో సడెన్ మార్పు వచ్చేసింది. శుక్రవారం నాడు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కూడా కావడంతో నరేంద్రమోడీ ఆఫ్ఘనిస్థాన్ నుంచే షరీఫ్‌కి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేశారు. దాంతో మురిసిపోయిన షరీఫ్ ఎలాగూ పక్కనే వున్నారుగా, మా దేశానికి కూడా వచ్చేయండి అని ఆహ్వానించేసరికి మోడీగారు వెంటనే లాహోర్ వెళ్ళిపోయారు. ఈ గొప్ప విషయాన్ని ప్రపంచానికి ట్విట్టర్లో ట్టిట్టడం ద్వారా తెలియజేశారు.

ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలని అనుకోవడం మంచి విషయమే. వాజ్‌పేయి తర్వాత పాకిస్థాన్‌కి వెళ్ళిన భారత ప్రధానిగా ఘన దక్కించుకోవడమే సంతోషకరమే. అయితే మోడీ పాకిస్థాన్‌కి వెళ్ళిన పద్ధతి మాత్రం సరైన విధంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్థాన్. ఎన్నో ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న దేశం పాకిస్థాన్. అలాంటి దేశానికి వెళ్ళేముందు భద్రతాపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది. పాకిస్థాన్‌లో ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని విషయం. అలాంటి పరిస్థితుల్లో మోడీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పాకిస్థాన్‌కి వెళ్ళడం సరైన పని కాదని పరిశీలకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu