ముసుగు తీసేసిన మోడీ!

ప్రధానిగా మోడీ తొలి సారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ ఆయన ప్రధాన అజెండా హిందుత్వ అన్న అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించి మోడీ ప్రధానిగా అధికార పగ్గాలు అందుకున్న తరువాత సమాజంలో ద్వేష భావం పెంపొందేలా వరుస సంఘటనలు జరిగాయని పరిశీలకులు ఉదాహరణలతో చెబుతున్నారు.

అయితే తాజాగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కనిపించిన దృశ్యాలు ఆయన ముసుగు తీసేశారనడానికి నిలువెత్తు నిదర్శనంగా వారు విశ్లేషిస్తున్నారు.  భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకిక విధానాలకు ఆయువు పట్టులాంటి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం యావత్తూ సాధువులు, మఠాధిపతుల ఆధ్వర్యంలో వారి ఆధిపత్యంతో సాగింది.  సాధువుల ఆశీర్వాదాల మధ్య సెంగోల్  (రాజదండం)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాష్టాంగ నమస్కారం చేడయం ఏ సంస్కృతికి ప్రతిబింబం.

సాధువులు – మఠాధిపతులు వెంటరాగా, తాను రాజదండంగా అభివర్ణించిన సింగోల ను స్వయంగా మోసుకెళ్ళి, స్పీకర్ స్థానానికి సమీపంలో ప్రతిష్టించారు. హిందుత్వ భావజాలానికి ఆద్యుడైన వినాయక్ దామోదర్ సావార్కర్ జన్మదినం  అయిన మే 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ద్వారా ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన సందేశమేమిటన్న ప్రశ్న విపక్ష రాజకీయ పార్టీల నుంచే కాదు.. భారత దేశం మతాతీత దేశమని భావించే కోట్లాది మంది ప్రజల నుంచీ వస్తున్నది. ఇంత కాలం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత దేశం హిందూ దేశం అని సమాజానికీ, ప్రపంచ దేశాలకీ సందేశంగా పార్లమెంటు భవన ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. 

 అన్నిటికీ మించి  రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభ కలిసిన వ్యవస్థ. అటువంటిది దేశ  ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి, సర్వసైన్యాధిపతి ప్రమేయం లేకుండా భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ద్వారా  ప్రజలకు మోడీ ఇచ్చిన సందేశమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలోని 19 ప్రధాన రాజకీయ పార్టీలు పార్లముంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించినా లెక్క చేయకుండా, ఆయా పార్టీలను సమాధాన పరిచి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలే చేయకుండా  మేం నిర్ణయించిందే శాసనం అన్నట్లుగా ప్రారంభోత్స కార్యక్రమాన్ని మోడీ కానిచ్చేశారు.

గత తొమ్మిదేళ్ళ పాలనలో మోడీ ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల నిర్వహణలో ఇష్టారీతిగా వ్యవహరించారు. ఉభయ సభల్లో దాదాపు 76% బిల్లులు  ఎలాంటి చర్చకానీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీల పరిశీలనకానీ లేకుండానే ఆమోదించేసిన తీరు ప్రజాస్వామ్యానికి శోభ నివ్వదు.  మొత్తం మీద మోడీ సర్కార్  ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.