అటా ఇటా.. ఎప్పటికి తేల్చుకుంటారు?

రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని విధాలుగా ఆలోచించడం సహజం. అయితే ఆ ప్రయత్నం మరీ సుదీర్ఘంగా సాగితే చులకన అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు దాదాపు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధినేతను ధిక్కరించి బహిష్కరణ వేటుకు గురి కావడం అంటే మామూలు విషయం కాదు.

మాజీ మంత్రి ఈటల తరువాత అంత సాహసోపేతంగా వ్యవహరించిన నేతలుగా పొంగులేటి, జూపల్లి గుర్తింపు పొందారు. ముఖ్యంగా పొంగులేటి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు దక్క నివ్వనంటూ భీషణ ప్రతిజ్ణ చేసి సంచలనం సృష్టించారు. అదేదో రాజకీయ ప్రకటన కాదనీ, నిజంగానే పొంగులేటికి జిల్లాపై అంత పట్టుందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తరువాత అటా..ఇటా ఎటువైపు అన్న విషయంలో పొంగులేటి, జూపల్లి చేస్తున్న కాలహననం వారిని ప్రజలలో పలుచన చేస్తున్నది. ఇరువురూ కడా అటా ఇటా అంటే కాంగ్రెస్ లోకా, బీజేపీలోకా అన్నది తేల్చుకోలేక సతమతమౌతున్నారు.

ఆ రెండు పార్టీలూ కూడా సిద్ధాంత పరంగా పరస్పర విరుద్ధమైనవి. కానీ వీరిరువురూ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టలలో ప్రస్తుతం ఏ పార్టీ బలంగా ఉందో అందులో చేరాలని భావిస్తున్నా.. తమ రాజకీయ అనుభవాన్నంతా రంగరించి పరిశీలిస్తున్నా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే  వారు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైందంటూ రెండు మూడు ముహూర్తాలు కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత తూచ్ కాదు కాదు, బీజేపీలో చేరుతున్నారంటూ కూడా ముహూర్తాలు ఖరారు అయ్యాయని ప్రచారం జరిగింది.

ఆ తరువాత రెండూ కాదు.. వీరిరువురూ కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అనీ, ఆ పేరుపై రిజిస్ట్రేషన్ కు కూడా దరఖాస్తు చేయడం అయిపోయిందనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా పొంగులేటి, జూపల్లిలు ఈటలతో రహస్య భేటీ జరపడంతో కమలం గూటికే చేరుతున్నారని అంతా భావించారు. తీరా భేటీ తరువాత ఈటల చేసిన వ్యాఖ్యలు వారు కమలానికి దూరమేనని తేటతెల్లం చేశాయి.

వారిరువురూ తనకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఈటల సెటైర్ వేయడంతో రహస్య భేటీ  పొంగులేటి, జూపల్లి కమలం గూటికి ప్రవేశించడానికి  మార్గం సుగమం చేయడం అటుంచి.. ఆ దారులనే మూసేసిందని తేటతె ల్లమైపోయింది.    ఇక వారి ముందున్నది రెండే మార్గాలు కాంగ్రెస్ లో చేరడం.. లేదా ప్రచారంలో ఉన్న విధంగా సొంత కుంపటి పెట్టుకోవడం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం చేస్తే.. వారి మద్దతు దారులు తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.