గుడివాడలో కొడాలికి ఇక ‘కాపు’ కాయరా?

మహానాడు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఉక్రోషంతోనో, మరో కారణంతోనో  వైసీపీ నేతలు తమ నోటికి పని చెప్పారు.  విపక్షంపై మరీ ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబుపై నోటికి పని చెప్పాలంటే.. కొడాలి నాని అందరి కంటే ముందుంటారు. ఇప్పుడు కూడా   ఎప్పటిలాగే  మినీ మేనిఫెస్టోపై దుమ్మెత్తి పోయడంలో కూడా నాని ముందంజలో ఉన్నారు.  చంద్రబాబు,  టీడీపీ నేతలపై ఆయన తన  మాటల దాడి ఉధృతి పెంచారు. ఈ  క్రమంలో నాని, కాపు సామాజిక వర్గం పై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసే కొడాలి నాని  మహానాడులో ఆయన ప్రకటించిన మినీ మేనిఫెస్టోను విమర్శించే క్రమంలో తన బూతుల పంచాంగం విప్పారు. ఆ క్రమంలో  ఆయన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అదే ఊపులో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారంటూ..  కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని.. ఇప్పుడు  కాపు వర్గం కొడాలి నానిపై  ఫైర్ అవుతోంది. కొడాలి నాని కాపు వర్గానికి క్షమాపణ చెప్పాలని, ఆయనను  వైసీపీ నుంచి  బహిష్కరించాలని కాపులు   డిమాండ్ చేస్తున్నారు.

కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించిన కొడాలి నానిని వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు, కాపు సంక్షేమ యువసేన డిమాండ్‌ చేసింది. కొడాలి నాని గుడి వాడలో గెలిచిందే కాపు ఓట్లతోనేనని, రాబోయే ఎన్నికల్లో గుడివాడలో ఓడించి కాపుల ఐక్యతను చాటుతామని జనసేన నేత లంకిశెట్టి బాలాజీ అన్నారు.

 గుడివాడలో కాపు సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో కాపు ఓట్లు ఉన్నాయి. ఇంత కాలం గుడివాడలో కాపు సామాజిక వర్గం కొడాలి నానికి మద్దతు ఇస్తూ వచ్చింది.  అయితే తన నోటి దురుసుతనంతో ఇప్పుడాయన వారిని దూరం చేసుకున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నాని కాపులకు బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.  

నోటికి గట్టిగా పని చెప్పడం.. మోటుగా.. కరుకుగా సమాధానం చెప్పడం.. అలవోకగా అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం.. వైకాపా నేతలకు సర్వసాధారణం. అలా బూతు మాటలను ప్రయోగిస్తేనే.... పార్టీలో గుర్తింపు లభిస్తుందన్న నమ్మకం వారిది. అయితే ఈ సారి మాత్రం నాని తన నోటీ దురుసుతనం వల్ల ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి.