బీసీలకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం : టీపీసీసీ చీఫ్‌

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం తమ విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. బీసీ రిజర్వేషన్లు  కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? ఆమెను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత పదేళ్లు కేసీఆర్ ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు అని టీపీసీసీ చీఫ్‌ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రేవంత్ సర్కార్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని వివరించారు. 

బీసీ రిజర్వేషన్లు రాహుల్‌ అజెండా, రేవంత్‌ నిబద్ధత’’ అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆర్టినెన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన తాము నిర్వహించతలపెట్టిన రైల్ రోకోను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్సులు, బిల్లులు పంపితే సంతకాలు పెట్టకుండా గవర్నర్లు ఆపుతున్నారు. తెలంగాణలో అదే పరిస్థితి వస్తే మాకు ఉద్యమాలు కొత్తకాదని మళ్లీ ఉద్యమం చేస్తామని రైళ్లు, బస్సులను స్తంభింపచేస్తామన్నారు. ఆర్డినెన్స్ రూపంలో వెంటనే రిజర్వేషన్లు కల్పించాలన్న కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కవిత అన్నారు.