అవినాష్ వెనుకే వైసీపీ క్యాడర్? జగన్ లో ఖంగారు!?

తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదన్నట్లుగా తయారైంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిస్థితి. వివేకా హత్య కేసులో సీబీఐ అఫిడవిట్ లో తన పేరు ప్రస్తావించడం, విచారించాలని విస్పష్టంగా పేర్కొనడంతో ప్రతిష్ట దిగజారడమే కాకుండా ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా తన సొంత నియోజకవర్గం పులివెందులలో  కూడా పరపతి కోల్పోయారు. అదే సమయంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. సీబీఐ విచారణకు హాజరు కాకుండా కోర్టుల ద్వారా అరెస్టును తప్పించుకున్న అవినాష్ రెడ్డికి జిల్లాలో పరపతి విపరీతింగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఒక వైపు జగన్ బేలగా తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు విపక్షంపై దూషణలకు దిగుతుంటే.. మరో వైపు అవినాష్ రెడ్డి పకడ్బందీగా క్యాడర్ ను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్, జగన్ ఇరువురూ కూడా తమదాకా దర్యాప్తు రాకుండా ఉంటే చాలన్నట్లుగానే వ్యవహరించారు. అయితే ఆ విషయంలో ఇద్దరూ విఫలమైనా.. దర్యాప్తు సంస్థను ముప్పుతిప్పలు పెట్టడంలోనూ.. అరెస్టు ను వాయిదాల మీద వాయిదాలు వేయించుకోవడంలోనూ సక్సెస్ అయిన అవినాష్ రెడ్డికి క్యాడర్ అండగా నిలబడుతూ వచ్చింది. అదే సమయంలో వివేకా హత్య కేసులో తన పేరు బయటకు రాకుండా ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఆ విషయంలో విఫలం కావడంతో క్యాడర్ దృష్టిలో పలుచన అయ్యారు. తొలుత వివేకా హత్య కేసులో అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అయితే తండ్రి అరెస్టు తరువాత అవినాష్ అరెస్టు ఖాయమనే అంతా భావించారు. కానీ తన అరెస్టును తప్పించుకోవడానికి కోర్టు మెట్లెక్కిన అవినాష్ రెడ్డి, తండ్రి అరెస్టయిన తరువాత ఒక్క సారి కూడా ఆయనను జైలులో పరామర్శించిన దాఖలాలు లేవు. కనీసం ఆయన కోసం బెయిలు పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. అదే విధంగా జగన్ కూడా అవినాష్ ను సీబీఐ విచారణకు పిలిచిన వెంటనే తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హస్తిన వెళ్లి కార్యం చక్కబెట్టుకు వచ్చిన  జగన్ ఆ సందర్భంగా చేసిన ప్రయత్నాలన్నీ ఆ దర్యాప్తు అవినాష్ తో ఆపేయాలనీ తన వరకూ రాకుండా ఉంటే చాలన్న రీతిలోనే సాగాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆ కారణంగానే అవినాష్ కు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లూ దర్యాప్తు సంస్థ నుంచి వెసులుబాటు లభించిందనీ, అయితే విషయం తెలుసుకున్న  అవినాష్  నేరుగా సీబీఐ దర్యాప్తు తీరుపైనే విమర్శలు గుప్పించడం, ఆరోపణలు చేయడంతో దర్యాప్తు సంస్థ మరింత పకడ్బందీగా ఉచ్చు బిగించిందనీ అంటున్నారు. వివేకా హత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న లేఖ ఫ్యాబ్రికేటెడ్ అని జగన్ అంటే అందుకు భిన్నంగా అవినాష్ ఆ లేఖనే తాను నిర్దోషిని అనడానికి సాక్షీభూతంగా ఉపయోగించుకున్నారు. దీంతో జగన్ చిక్కుల్లో పడినట్లైంది. వివేకా తనను హత్య చేస్తుంటే లేఖ ఎలా రాయగలరని జగన్ ప్రశ్నిస్తే.. సీబీఐ దర్యాప్తులో ఆ లేఖ వివేకానందరెడ్డే రాశారని ధృవీకరించింది. దీంతో జగన్ చిక్కుల్లో పడ్డారు.  ఒక వైపు అవినాష్ సీబీఐని ముప్పతిప్పలు పెడుతుంటే.. జగన్ అందుకు భిన్నంగా తనంత తానుగా కేసులో దర్యాప్తును ఎదుర్కొనేలా చిక్కుకున్నారన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నది. నాలుగేళ్ల పాలనలో  అన్ని వర్గాలకూ దూరమైన జగన్ పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంలో కూడా విఫలమయ్యారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. అందుకు భిన్నంగా అవినాష్ రెడ్డి నిత్యం కేడర్ మధ్యే ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. అందుకే జగన్ సభల నుంచి జనం పారిపోతున్నా నిలువరించడంలో  పార్టీ క్యాడర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో  అవినాష్ రెడ్డి తల్లిని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చి తాను కూడా అక్కడే షెల్టర్ తీసుకున్న సమయంలో సీబీఐ అధికారులు కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్లేందుకు వీలు లేకుండా వైసీపీ క్యాడర్ రోజుల తరబడి ఆస్పత్రి వద్ద తిష్ట వేసి నిలువరించింది. పరిస్థితిని గమనిస్తుంటే.. వివేకా హత్య కేసు దర్యాప్తు ఔట్ కమ్ ఏదైనా రానున్న రోజులలో పార్టీపై జగన్ పట్టు సడిలే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, అదే సమయంలో అవినాష్ రెడ్డి పట్టు సాధించే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  

పార్టీపై పట్టు సడలిపోతుందన్న భయంతో శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు ఉండే అవకాశం లేదు. నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే అలా ఎన్నికలు జరిగితే ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం ఉండదన్న భయంతోనే జగన్ శాశ్వత అధ్యక్ష హోదా కోసం తహతహలాడారనీ, ప్రస్తుతం పార్టీలో ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని గమనిస్తే ఆయన ఎందుకు భయపడ్డారో అవగతమౌతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బాబాయ్ హత్య కేసు జగన్ ను పార్టీలో బలహీనుడిని చేస్తే అదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి పార్టీపై పట్టు బిగించే అవకాశాన్ని ఇచ్చింది. జనవరిలో తొలి సారి అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటి నుంచీ ఈ ఐదు నెలలలో అవినాష్ నిత్యం వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ వస్తుంటే.. జగన్ మాత్రం జనానికి దూరమయ్యారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అదీగాక త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో  అధికార పార్టీ సీట్టింగులలో  సగం మందికి పైగా టిక్కుట్లుఇచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో  టికెట్ దక్కదన్న నిర్ధారణకు వచ్చిన సిట్టింగులు జగన్ కు వ్యతిరేకంగా అవినాష్ నాయకత్వం కింద తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. లేదా అవినాష్ నాయకత్వంలో పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu