కేసీఆర్‌ను కలిసిన మహిళా మంత్రులు...ఎందుకంటే?
posted on Jan 8, 2026 4:39PM
.webp)
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు మంత్రులు ఆయన నివాసాన్ని సందర్శించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆకాంక్షరెడ్డి కలిసి కేసీఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానాలు అందజేసినప్పటికీ కేసీఆర్‌ను ఎదురుగా కలుసుకునే అవకాశం రాలేదని మంత్రి సీతక్క అన్నారు. అందుకే ప్రత్యేకంగా ఆయన వద్దకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం ఇచ్చామని తెలిపారు. ఆదివాసుల గౌరవం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర అయిన మేడారం మహాజాతరకు తప్పకుండా రావాలంటూ కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మకు ఆహ్వానం అందజేశారు. తల్లుల బంగారం, వస్త్రాలను అందించి గౌరవించారు.
మా ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించడంతో ఆనందంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజకీయాలకది సమయం కాదని, రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ జాతరకు ప్రతి ఒక్కరూ రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా మేడారం మహాజాతరకు వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు.