సినిమా క్యాసెట్లతో వచ్చింది... సినిమా స్టైల్లోనే ఎదిగింది!
posted on Feb 6, 2017 2:38PM
.jpg)
శశికళ... శశికళ.. శశికళ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కలకలం! జయలలిత స్నేహితురాలిగా నిన్న మొన్నటి వరకూ వార్తల్లో వున్న ఆమె ఇప్పుడు కాబోయే సీఎం! అమ్మ తరువాత చిన్నమ్మగా తమిళ ప్రజలకి మాతృ ప్రేమ పంచబోతోంది! కొందరు ఓకే అన్నా, కొందరు నాట్ ఓకే అన్నా, కొందరు అస్సలు కుదరదు అన్నా శశికళ తన రూట్లో తాను సెక్రటేరియట్ కి దారితీస్తోంది. అయితే, ఈ శశికళ ఎవరు? ఒకప్పుడు వీడియో క్యాసెట్లు అమ్ముకున్న ఆమె ఇవాళ్ల చెన్నై రాజకీయాల్లో వీరనారిగా ఎలా అవతరించగలిగింది? తెలుసుకుంటే ఆశ్చర్యకరం కలగకమానదు!
శశికళ తాత తంజావూరులో నాటు వైద్యుడు. ఆయన కొడుకు వివేకానందన్. అతనో ఆల్లోపతి మందుల దుకాణం నడిపేవాడు. అందుకే, శశికళ కుటుంబాన్ని తంజావూరులో ఇంగ్లీషు మందుల దుకాణం వాళ్లు అనేవారు. అలా మెడికల్ షాపు నడిపే వివేకానందన్ కి జన్మించిన ఐదో సంతానమైన శశికళ నటరాజన్ ను పెళ్లి చేసుకుంది. ఆయన తమిళనాడు ప్రభుత్వంలోని పౌర సరఫరాల శాఖలో అధికారి. అదే జయలలిత వైపుకి శశికళ అడుగులు పడేలా చేసింది!
జయలలిత అన్నాడీఎంకేలో చేరగానే ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేసిన ఎంజీఆర్ ప్రచార కార్యదర్శిగా కూడా నియమించారు. ఆ బాధ్యతల్లో భాగంగా జయలలిత కడలూరుకు వెళ్లింది. అక్కడ ఆమెకు స్థానిక కలెక్టర్ చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. తరువాత చంద్రలేఖే జయకు సహాయకురాలుగా నియమింపబడింది. అలా వారిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. కాని, తనకు తెలియకుండానే కలెక్టర్ చంద్రలేఖ ఓ చారిత్రక కలయికకి పునాది వేసింది! ఆమె తనకు అప్పటికే పరిచయం వున్న గవర్నమెంట్ అధికారి నటరాజన్ను, ఆయన భార్య శశికళను జయకు పరిచయం చేసింది. శశికళకు అప్పటికే వీడియో క్యాసెట్ల దుకాణం వుండటంతో జయలలిత ఆమెతో ఇంగ్లీషు సినిమాలు తెప్పించుకుని చూస్తూ వుండేది! అదే వారిద్దరి మధ్యా ప్రగాఢమైన అనుబంధానికి దారితీసింది! అసలు ఒక దశలో వాళ్లిద్దరూ ఓ గుడిలో దండలు మార్చుకుని పెద్ద దుమారమే రేపారు!
1989 వరకూ ఆషామాషిగా నడిచిన అమ్మ, చిన్నమ్మల ఫ్రెండ్ షిప్ అప్పట్నుంచీ కొత్త పుంతలు తొక్కింది. శశి ఏకంగా జయ ఇంట్లోకే మకాం మార్చింది. ఇద్దరూ ఒకర్ని వదిలి ఒకరు వుండటమే మానేశారు. జయలలిత తన రక్త సంబంధీకులందర్నీ దూరం పెట్టేసింది. శశికళే తన తోడు, నీడ అనుకుంది. శశికళ కూడా స్లోగా జయ జీవితాన్ని తన ప్రభావంతో నింపేసింది. ఆఖరుకు ఆమె ప్రఖ్యాత పోయెస్ గార్డెన్ ఇంట్లో పని వారు కూడా శశికళ భర్త ఊరైన మన్నార్ గుడి నుంచే వచ్చేవారు!
శశికళ పూర్తిగా జయ ప్రపంచంపై పట్టుబిగిస్తున్న కాలంలోనే ఎక్కడో బెడిసి కొట్టింది. అమాంతం పురుచ్చి తలైవీ ఆమెని, ఆమె కుటుంబాన్ని ఇంట్లోంచి గెంటేసింది. దీనికి కారణం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి , ప్రస్తుత ప్రధాని అందించిన సమాచారమే అంటారు. జయకు తెలియకుండా ఆమె చుట్టూ శశికళ , ఆమె కుటుంబం గొయ్యి తోవుతున్నారని మోదీ చెప్పాడంటారు. ఆయనకు వున్న ఇంటలిజెన్స్ సమాచారాన్ని నమ్మిన జయలలిత శశికళ, ఆమె కుటుంబం ... ఉరఫ్ , మన్నార్ గుడి మాఫియాను పోయెస్ గార్డెన్ లోంచి బయటకు పంపింది.
కాని, మూడు నెలల్లోనే శశికళ కాళ్లు పట్టుకుని బతిమాలి తిరిగి స్నేహితురాలి పంచన చేరింది. అదే జయ చేసిన ఆఖరి తప్పని కొందరంటారు. ఆ విషయం ఎలా వున్నా శశికళ తిరిగి వచ్చాక క్రమంగా జయమ్మ ఆరోగ్యం క్షీణించింది. అపోలో హాస్పిటల్లో అంతిమ ఘడియలు గడిచిపోయాయి. అప్పుడు కూడా ఆమె పక్కన శశికళ తాను వుందే తప్ప ఎవ్వర్నీ దగ్గరకు రానీయలేదు! అమ్మ జీవితాన్ని చిన్నమ్మ శాసించిందా? చెప్పలేం. కాని, ఆమె జీవితాన్ని మాత్రం ఈమె ఖచ్చితంగా ప్రభావితం చేసింది!