రెండో పెళ్లి చేస్తామంటూ దోచేశారు..
posted on Jun 10, 2016 5:07PM

వీలైనన్ని మార్గాల్లో సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి జాబితాలోకి పెళ్లిని కూడా చేర్చారు. యాభై ఏళ్ల వ్యక్తిని పెళ్లి పేరుతో మోసం చేసి ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్‌కు దిగి ఒళ్లు, ఇళ్లు గుల్ల చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన పర్సోత్తమ్ మార్వియాకు మూడేళ్ల క్రితం భార్య మరణించింది. అతనికి ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. భార్య మరణించినప్పటి నుంచి మానసిక వేదనలో ఉన్న తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని పిల్లలు నిర్ణయించారు. ఈ మేరకు వారు తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చారు. పిల్లల కోరిక మేరకు అహ్మదాబాద్‌కు చెందిన పెళ్లిళ్ల బ్రోకర్ షీలాను సంప్రదించాడు పర్సోత్తమ్. సంబంధాలు చూసుకోవడానికి షీలా ఆయన్ను అహ్మదాబాద్‌కు రమ్మంది. అక్కడ మంజుల అనే 37 సంవత్సరాల మహిళతో పాటు మరో ఆమెను చూపించింది. అయితే వారు నచ్చలేదని పర్సోత్తమ్ తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.
అయితే మంజుల పదేపదే ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని కోరింది. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీనికి భయపడిన పర్సోత్తమ్ తిరిగి అహ్మదాబాద్ వెళ్లి మంజులను కలిశాడు. ఆమె ఆయన్ను మౌంట్ అబూకి తీసుకువెళ్లి హోటల్ గదిలో మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చింది. పర్సోత్తమ్ మత్తులోకి జారుకున్న అనంతరం వేరోక మహిళతో కలిసి ఉన్నట్టుగా అసభ్యంగా ఫోటోలు తీసింది. అతని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, 12,000 రూపాయలు దోచేసి పారిపోయింది.
మత్తు వదిలిన తర్వాత జరిగిన మోసాన్ని గుర్తించిన పర్సోత్తమ్ తిరిగి అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ కుట్ర అక్కడితో ఆగలేదు.. పర్సోత్తమ్‌కు ఓ యువకుడు ఫోన్ చేసి అమ్మాయితో కలిసున్న ఫోటోలు ఉన్నాయని రూ.25 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫోటోలు సోషలో మీడియాతో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. కంగారుపడిన ఆయన చివరకు రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకుని, డబ్బు పట్టుకుని అహ్మదాబాద్‌కు పయనమయ్యాడు. తండ్రి ఆందోళనగా ఉండటాన్ని గమనించిన కొడుకు నిలదీయగా జరిగిన కథంతా చెప్పాడు. వెంటనే ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వలపన్ని మంజుల, షీలాతో పాటు మరోక మహిళను బెదిరించిన యువకుడిని అరెస్ట్ చేశారు.