కేరళ క్రీడా మంత్రులకు జనరల్ నాలెడ్జ్ నిల్..?
posted on Jun 10, 2016 3:38PM
.jpg)
కేరళ క్రీడామంత్రులకు జనరల్ నాలెడ్జ్ లేదనుకుంటా..? మొన్న బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ ఆలీ మరణిస్తే ఆయన కేరళకు చెందిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు ఆ రాష్ట్ర ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి ఈసీ.జయరాజన్. ఆయనే అలా ఉంటే తాను రెండాకులు ఎక్కువే చదివానంటూ ముందుకు వచ్చారు కేరళ మాజీ క్రీడల మంత్రి సుధాకరన్. వివరాల్లోకి వెళితే జయరాజన్‌ను మర్యాద పూర్వకంగా కలవడానికి కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్, ప్రముఖ అథ్లెట్, అర్జున అవార్డు విన్నర్ అంజు బాబీ జార్జ్ వెళ్లారు. అయితే తనను అవినీతిపరురాలినని, గత ప్రభుత్వపు మనిషివని జయరాజన్ అవమానించారని ఆమె ఆరోపించారు.
దీంతో అంజుకి బాసటగా నిలచారు మాజీ క్రీడా శాఖ మంత్రి సుధాకరన్. జయరాజన్‌కు క్రీడలపై అసలు అవగాహనే లేదంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇక్కడే ఆయన జనరల్ నాలెడ్జ్ బయటకొచ్చింది. అంజు బాబీ జార్జ్‌తో పాటు ఆమె భర్త జిమ్మీ జార్జ్ కుటుంబం అంతా కేరళలో క్రీడల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని వ్యాఖ్యానించారు. నిజానికి అంజు బాబీ జార్జ్ భర్త పేరు రాబర్ట్ బాబీ జార్జ్. రాబర్ట్ కూడా ప్రముఖ క్రీడాకారుడే కావడంతో ఆమెకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఆ విషయం తెలియని సుధాకరన్ అంజు భర్త పేరును తప్పుగా పలికి విమర్శలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు వీరిద్దరిని కేరళ నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక ఆటాడుకుంటున్నారు.