దీర్ఘ మేర ఆరోగ్య మ(శి)స్తు!!
posted on Dec 20, 2021 9:30AM
జీవితంలో ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం మంచిగా లేకపోతే సంపాదించుకున్నది అంతా మనల్ని చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేనా ఆరోగ్యం సరిగా లేకపోతే సంపాదన మొత్తం హాస్పిటల్స్ కు, డాక్టర్స్ కు శిస్తు కట్టినట్టు కట్టాల్సి వస్తుంది. ఇప్పట్లో రోగం లేని మనిషి అంటూ లేడు. బీపీలను, షుగర్లను వెంట పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు మనుషులు. ఒకప్పుడు జబ్బులనేవి తక్కువ. నిజానికి జీవితం ఖరీదు అవుతుంటే జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కటీ ఎంతో ఖర్చుతో సమకూర్చుకోవలసి వస్తుంది. అందుకే బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఆరోగ్య సమస్యలు అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉన్నాయి.
ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి??
గత యాభై సంవత్సరాలు ఇంకా కనీసం పది, ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే జనాబాకు జబ్బుల దాడి ఎక్కువయ్యింది. అదేనండి సమస్యలు ఎక్కువ అయ్యాయి. కారణం ఏమిటి అని ఆలోచిస్తే వ్యవసాయ పంటలలో పోషణ తగ్గింది. పెద్దలు చెబుతూ ఉంటారు ఒకప్పుడు గింజలు, విత్తనాల రుచి వేరు అని. అది నిజమే కావచ్చు. సేంద్రీయ వ్యవసాయం నుండి పురుగుమందులు ఉపయోగించి పంటలు పండించడం వల్ల రుచి తగ్గిందనేమాట వాస్తవం. అయితే ఇది కాకుండా మరొకటి ఉంది. అదే పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం.
పొరుగింటి పుల్లకూర రుచి!!
ఓకేప్రాంతంలో ఉండేవాళ్ళు ఒకేరకమైన వాతావరణంలో ఉంటారు. పొరుగింటి పుల్లకూర తిన్నా పర్లేదు ఏమీ కాదు. విదేశాలు పూర్తిగా భారతదేశ వాతావరణానికి భిన్నంగా ఉంటాయి. అక్కడి వాతావరణం, అక్కడ పండే పంటలు వారు తింటారు. అయితే అవి తెచ్చి ఇక్కడ తినడం వల్ల వస్తున్నవే ఆరోగ్య సమస్యలు. వారు అక్కడ వాడే పదార్థాలు వారికి దొరికే స్వఛ్చమైనవి అయి ఉండచ్చు, కానీ అవి ఇక్కడికి పచ్చేసరికి 50% పైగా కలుషితం అవుతాయి. వాటి మీద లేబుల్స్ మెరుస్తూ, మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు అతికిస్తూ విదేశీ ఫుడ్ ఎంతగానో జనాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్యాకింగ్ ఫుడ్స్ ను ఇన్స్టంట్ ఫుడ్స్ ను పరిచయం చేసింది విదేశీ వ్యాపారాలే. నిజానికి విదేశాలలో కూడా జీర్ణసంబంధ సమస్యలు, పేగు క్యాన్సర్లు ఎక్కువ. కారణం వారు తినే ఆహారం, వారి అలవాట్లు కూడా.
అవసరాలు, ఆహారం అయ్యో!! అయ్యో!!
చాలా ఇళ్లలో ఆహారం విషయంలో అయినా నిర్లక్ష్యం చేస్తారు కానీ అవసరాలు తీర్చుకోవడంలో మాత్రం అస్సలు తగ్గేది లేదు. నిజానికి ప్రతి కుటుంబంలో ఆహార ఆవశ్యకత గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పచ్చు. ఏ రోగమో, రొప్పో వచ్చినప్పుడు మందులతో ఆ రోగానికి టెంపరరీ సొల్యూషన్స్ వెతుక్కోవడం, శరీర సామర్థాన్ని రోజు రోజుకూ దిగజార్చుకోవడం, అలా ఆరోగ్యాన్ని ఖూనీ చేసుకునే లెజెండ్స్ ఎక్కువయ్యారని చెప్పచ్చు. మన భారతదేశానికి మహర్షులు ప్రసాదించిన ఆయుర్వేదాన్ని కాదని చిటికెలో తలనొప్పులు, గొంతు గరగరలు తగ్గించే ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడి జీవితకాలన్ని తగ్గించుకుంటున్నారు.
అందుకే జీవితంలో సంపాదించే దానిలో మొదట ఆహారం కోసం ఎక్కువ మొత్తం వెచ్చిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఉండాలి. అలా ఉంటేనే ఇప్పటి కాలంలో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆయుర్వేదంలో సూచించబడిన ఎన్నో అద్భుత మొక్కలను రోజువారీ సమస్యలలో ఉపయోగించవచ్చు. పలితం శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. లేదూ సరిపడని తిండి, వ్యతిరేకమైన అలవాట్లు ఫాలో అవుతామని అంటే అలాగే కానివ్వండి. అయితే సంపూర్ణ ఆరోగ్యం కోల్పోయి దానికి శిస్తు కడుతూ శిక్ష అనుభవిస్తారు తప్పనిసరిగా!!
◆ వెంకటేష్ పువ్వాడ