కొన్ని మొహమాటాలు లేకుంటే జీవితం ఎంతో బాగుంటుంది!!

జీవితం చాలా విలువైనది. ముఖ్యంగా జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మరీ ముఖ్యమైనవి. జీవితాన్ని అవి ప్రభావితం చేస్తాయి. జీవితం ప్రభావితమైనపుడు అనుకూలతలు చోటు చేసుకుంటే  ఒకే. కానీ ప్రతికూలతలు ఎదురైతే మాత్రం జీవితం కుదుపులకు లోనవుతుంది. ఆ కుదుపులు అన్నీ మనిషి మానసిక పరిస్థితులను అతలాకుతలం చేస్తాయి. మరి ఇన్ని అనర్థాలకు ఒకే ఒక విషయం కారణం అవుతుందంటే అది నిజంగా చిన్న విషయం అని ఎలా అనుకోవాలి??


మొహమాటం!!


కాదని, లేదని లేక ఇష్టం లేకపోయినా ఒప్పుకునే ప్రవర్తన స్వభావం మొహమాటం. ఇది ఎంతో సున్నితమైన అంశం కూడా. 


*మా అమ్మాయికి మొహమాటం ఎక్కువ పెద్దగా మాట్లాడదు. (పర్లేదు మనుషులు అలవాటు కానిది ఈ కాలంలో మునిగిపోయి మాట్లాడేవాళ్ళు తక్కువే. అలవాటైతే మాట్లాడతారు)


* మా అబ్బాయికి మొహమాటం ఎక్కువ ఎవరితో ఎక్కువగా కలవడు(బహుశా ఇంట్రోవేర్ట్ కావచ్చు. అంతర్ముఖులుగా ఉండేవారు అనవసర గోడవల్లోకి వెళ్లరు కాబట్టి సమస్య ఏమీలేదు)


* మా ఆయనకు మోహమాటం ఎక్కువండి ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెప్పలేరు.(ఇదీ పాయింట్. మోహమాటంతో ఏమీ కాదని చెప్పలేక ఇబ్బందుల్లో ఇరుక్కుపోరూ)


*అయ్యో మీరు మరీ మొహమాట పడకండి. మీకేం కావాలన్నా అడగండి. నేను సహాయం చేస్తాను కదా( ఈ బాపతు మనుషులు దారిన పోయే దాన్ని నెత్తికి ఎక్కించుకునేరకం)


*సరేనని చెప్పకపోతే వాళ్ళు నొచ్చుకుంటారేమో (ఇలా భావించి ఎన్నో విషయాలలో దిగబడిపోయేవాళ్ళు ఎక్కువ)


పై విధంగా  చెప్పుకుంటే ఎంతో మంది ఇలా మొహమాటంతో తమని తాము ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంటారు. తరువాత తీరిగ్గా అలా చెయ్యకుండా ఉంది ఉంటే బాగుండెమో, ఏమి చేస్తాం పరిస్థితి అలా మారిపోయింది అనుకుంటారు. ఇంతకూ ఏ పరిస్థితి ఎలా మతింది. మొహమాటం అనేది  ఎలాంటి విషయాలలో వదిలేస్తే జీవితం బాగుంటుంది??


ఆర్థిక విషయాలు!!


డబ్బులు ఎవరికీ చెట్లకు కాయవు. కొందరు సహాయం అడుగుతుంటారు. అవతలి వాళ్లకు సహాయం చేయడం మానవత్వమే. కానీ ఈ ఆర్థిక విషయాలలో అనవసరమైన తలనొప్పుల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. అప్పులు ఇవ్వడం, ఇప్పించడం, ష్యురిటీలు ఇవ్వడం వంటివి మీరు ఆర్థికపరంగా కాసింత మంచి స్థాయిలో ఉంటేనే చెయ్యండి. ఒకవేళ సమస్య మీకు ఎదురైనా భరించగలను అనే నమ్మకం ఉంటేనే చెయ్యండి.


వ్యక్తిగత నిర్ణయాలు!!


సాధారణంగా వ్యక్తిగత నిర్ణయాలలో చదువు, పెళ్లి ముఖ్యమైనవి. అది వద్దు ఇది చదువు అని కొందరు చెబుతారు, అక్కడొద్దు ఇక్కడే ఉండు అని కొందరు చెబుతారు. మోహమాటానికో వాళ్లకు అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నారు అనో ఆసక్తి లేని రంగంలోనూ, ఆసక్తి లేని కోర్సులలోనూ చేరద్దు. 


అలాగే మరొక విషయం పెళ్లి. అబ్బాయి బాగున్నాడు, ఆర్థికంగా మంచి స్థాయి. మంచి ఉద్యోగం, సాలరీ బాగుంది. ఒకమ్మాయికి కావాల్సింది నిజంగా ఇంతేనా?? ఎంత కేర్ గా చూసుకుంటారు, ఎంత అర్థం చేసుకుంటారు అనేది కదా ముఖ్యమైన విషయం. ఇంకా కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య మాత్రమే జరిగే విషయాల మాటేమిటి?? చుట్టాలు, తెలిసినవాళ్ళు చెప్పే పై విషయాలు విని పెళ్లి లాంటి వాటికి ఒప్పేసుకుంటే తరువాత జీవితకాల బాధలు అనుభవించాలి. అందుకే కాబోయే జీవిత భాగస్వామితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది కదా.


ఇక్కడ మిస్సయిన ఇంకొక విషయం సహోద్యోగుల దగ్గర మొహమాటం. వాళ్ళు అడిగారని వాళ్ళ పనులు కూడా చేసిపెడుతూ ఉండటం. వ్యక్తిగత సమయాలను త్యాగం చేసేయ్యడం. ఇది మొదట్లో పెద్ద సమస్య కాదు కానీ మెల్లిగా వాటి ఫలితాలు తెలుస్తాయి.


అలాగే ఇరుగు పొరుగు మనుషుల దగ్గర కూడా ఇదే అవుతుంది. అందుకే మొహమాటం లేకుండా ఇబ్బందికరం అనిపించే విషయాలను కాదని చెప్పడం కుదరదని చెప్పడం మంచిది.


                                 ◆వెంకటేష్ పువ్వాడ.