అతిథులొస్తున్నారా??


అతిథిదేవోభవ అని అన్నారు మనవాళ్ళు. ఎన్ని దేశాలు తిరిగినా ఎంతమందిని కలిసినా ఇంటికి వచ్చిన గెస్ట్ లను ఆదరించడం, తృప్తి పరచడం అనేది తప్పనిసరి. అయితే సాధారణ మిత్రులు అయితే ఇంటికి వచ్చినప్పుడు అతిథిమర్యాదల విషయంలో అంత ఖంగారు పడాల్సిన అవసరం ఉండదు. కానీ కొంచెం ప్రత్యేకమైన వారు, స్థాయిలో పెద్దవారు, ఇంకా వయసులో పెద్దవారు ఇవి మాత్రమే కాకుండా మొదటిసారి ఇంటికి వస్తున్నవారు వీరి విషయంలో కాసింత శ్రద్దపెట్టాల్సిందే. 


అందరి ఆలోచన!!


ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారు అంటే మంచి భోజనం పెట్టడం వరకు మాత్రమే చాలా మంది ఆలోచన ఉంటుంది. మాంసాహరులు అయితే చికేనో, మటనో వండేసి దాంతో గెస్ట్ లు తృప్తి పడిపోతారని అనుకుంటారు. కానీ భోజనం అనేది ఇంటికి వచ్చే వారికి ఒక అంశం మాత్రమే. చాలమంది ఆ భోజనం విషయంలో శ్రద్ధ పెట్టి ఎన్నో విషయాలు మర్చిపోతుంటారు. కొంచం వాటి గురించి తెలుసుకోవాలి మరి.


సమయం, సందర్భం!!


సాధారణంగా ఇంటికి వచ్చేవాళ్ళు చెప్పే వస్తారు. వాళ్ళందరూ అతిథులు కాదు, చెప్పకుండా వచ్చేవాళ్లే అతిథులు అని కొందరు అంటారు. కానీ చెప్పి వచ్చినా, చెప్పకుండా వచ్చినా ఇంటికి వచ్చేవారు అతిథులే.


జెండర్ జాగ్రత్తలు!! 


ఇంటికి వచ్చే అతిథులు మగవాళ్ళు అయితే కేవలం రెండు విషయాలు మాత్రమే సరిగ్గా ఉంటే చాలని అనుకుంటారు. సరైన భోజనం, పడుకోవడానికి అనుకూలంగా ఉండటం. 


కానీ ఆడవాళ్లు అయితే మాత్రం ఇల్లంతా శుభ్రత ఎలా ఉంది, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు లాంటివి చాలా అబ్సర్వ్ చేస్తుంటారు. కాబట్టి జెండర్ ను బట్టి ఇంట్లో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.


ఏర్పాట్లు అగచాట్లు!!


వద్దే వద్దు బాబోయ్, ఇంటికి ఎవరైనా వస్తారంటే పెద్ద హడావిడి మొదలైపోతుంది. ఇల్లంతా అటు ఉండేవి ఇటు ఇటు ఉండేవి అటు ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నవి, బట్టలు, వస్తువులు పడుకునే బెడ్ లు, కూర్చోవాల్సిన కుర్చీలు, కూలర్ లు, బుక్ షెల్ఫ్స్ ఇలాంటివి ఒకటా రెండా బొచ్చెడు పనులు. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. 


సాధారణ రోజుల్లో ఎక్కడి వస్తువులు అక్కడ ఉండేలా చూసుకోవడం. ఏదైనా వస్తువు తీసుకుని వాడుకున్నాక తిరిగి దాని స్థానంలో దాన్ని ఉంచాలి. ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే  తీసుకున్న వాటిని తిరిగి జాగ్రత్తగా ఉంచడం నేర్పిస్తే ఎంతో క్రమశిక్షణ అలవడుతుంది.


వారానికి ఒక్కసారి ఇంటికి బూజు క్లీన్ చేయడం. రెగులర్ పనులలో వస్తువులను నీట్ గా ఉంచడం. విప్పేసిన బట్టలు ఒక చోట పెట్టడం. ఇంకా ఉతికిన బట్టలు చెల్లాచెదురుగా కాకుండా కొంచెం ఓపిక చేసుకుని మడత పెట్టేయడం. ఇంట్లో చెత్త వంటి వాటిని బుట్టలో నింపి పోగు చేయకుండా ఎప్పటికప్పుడు బయట పడేయడం.


బాత్రూములు భలే తికమకలు!!


చాలామంది ఇల్లు ఎలా ఉంచుకున్నా బాత్రూముల విషయంలో మాత్రం నెగ్లేట్ గా ఉంటారు. వాడిన షాంపూ బెటల్స్, షాంపూ ప్యాకేట్స్ దగ్గర నుండి, సోపు ముక్కలు ఇంకా బాత్రూమ్ లో బకెట్ లు, మగ్ లు లాంటివి కొంచెం మారుస్తూ ఉండటం  మంచిది. అన్నిటికీ మించి నీటి వసతి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ల షేవింగ్ పరికరాలు, ఆడవాళ్ళ పర్సనల్ ఐటమ్స్ బాత్రూమ్ లలో ఉండకూడదు. ఇంకా ముఖ్యంగా విడిచిన బట్టలు బాత్రూమ్ లలో అట్లాగే పెట్టేయకూడదు. బాత్రూమ్ లో కేవలం సోపులు, షాంపూలు, బకెట్, మగ్, స్నానం చేసేటప్పుడు బట్టలు వేసుకోవడానికి హోల్డర్స్ ఉండాలి అంతే.

వండటం, వడ్డించడం!!


వండటం ఒక కళ అయితే వడ్డించడం ఒక కళ. అదేదో ఇంటికి వచ్చిన వాళ్ళు మోహమాటపడతారని దగ్గరుండి వేసుకో వేసుకో అని కంచాల్లో కుమ్మరించడం చేయకూడదు. అలాగని మరీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి ఒక్కటీ ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ గా చిరునవ్వుతో అడగాలి. అలాగే పెద్ద మొత్తం ఉన్న గిన్నెలు అన్ని ముందు ఉంచకూడదు. చాలామంది వండిన గిన్నెలను అట్టే ఎత్తుకొచ్చి భోజనం చేసేచోట పెట్టేస్తుంటారు. అలా కాకుండా వండిన వాటిని వేరే గిన్నెల్లోకి మార్చుకుని తీసుకొచ్చి పెట్టడం బాగుంటుంది. ఎన్ని రకాలు వండాము అనేది కాకుండా శ్రద్దగా ఎన్ని చేసాము అనేది మైండ్ లో పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా వీలైనవరకు బయట నుండి తెప్పించడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ ఉన్న ప్రాంతాలలో చాలా ఫెమస్ పదార్థాలు ఉంటే వాటిని భాగం చేయచ్చు కానీ పూర్తిగా అవే ముందు పెట్టేసి హమ్మయ్య అనుకోకూడదు. 


చిన్న జాగ్రత్తలు!!


ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడు టీవీ లలో ప్రోగ్రాం ల మీద మరీ ఇంట్రెస్ట్ పెట్టకండి. రిమోట్ అతిథుల చేతుల్లో పెట్టండి. అదొక గౌరవమూనూ. ఇంకా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, కామన్ స్నేహితులు ఇలా ఎవరైనా వచ్చినా గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకోవద్దు. మాటల్లో పడి పనులు వాయిదా వేయొద్దు. ముఖ్యంగా కిచెన్ పనులు ఎప్పటికప్పుడు చేసి శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వాసనలు ఉండవు. వీలుంటే నాచురల్ ఎయిర్ ఫ్రెషర్ లు అయిన పువ్వులు, అగరొత్తులు, వాడటం మంచిది. ఇంట్లో గదుల తలుపులు, కిచెన్ తలుపులు అలా తెరచి ఉంచద్దు. కర్టెన్ లు వేయడం మంచిది. అతిథులు వచ్చారు కదా అని ఎడాపెడా మాట్లాడేయొద్దు. వాళ్లకు తగిన విశ్రాంతి, తగిన కంఫర్ట్ ఇవ్వడం మంచిది.


                                 

◆వెంకటేష్ పువ్వాడ.