ఈ దొంగకు మీరూ ఫాన్ అయిపోతారు!!

మార్చి 19, 1987 ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలో అరవింద్ ఇనామ్‌దార్‌కు అత్యవసరమైన ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో అరవింద్ కు త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ వారి ఒపెరా హౌస్‌ శాఖలో ఏదో తేడా జరుగుతుందనే విషయం చెప్పారు. 


ముంబై నగరంలోని ఒపెరా హౌస్ ప్రాంతంలో చాలా ఆభరణాల దుకాణాలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ(టి.బి.జెడ్)లో సిబిఐ దాడి జరిగింది. బృందం లోపలికి వచ్చి, షట్టర్ క్రిందికి లాగి, సిబ్బందిని ఇంకా ఖాతాదారులను "రిజిస్టర్లను పరిశీలించేవరకు వేచి ఉండండి కాల్ ద్వారా అరవింద్ తెలుసుకుంటారు"  అని చెప్పారు. 


సాధారణంగా సిబిఐ దాడులు జరిగినప్పుడు ఎలాంటి ఫోన్ కాల్స్ జరగకుండా ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ పాటిస్తుంది సిబిఐ. అలాగే ఇక్కడ కూడా జరిగింది. కానీ అదంతా జరిగిన తర్వాతనే ఆయనకి తేడా కొట్టింది. సిబిఐ టీమ్ చాలా ఆభరణాలతో బయలుదేరినట్లు ఇనామ్‌దార్‌కు కాల్ చేసి చెప్పారు ఆభరణాల షాప్ లో పనిచేసేవాళ్ళు.  అది అతనికి వింతగా అనిపించింది.


అరవింద్ అక్కడికి తన టీమ్ తో ఆ ఆభరణాల షాప్ ల దగ్గరకు చేరుకున్నాక తెలిసిన  విషయాలు అతనికి మరింత విచిత్రంగా అనిపించాయి.


ఆ సిబిఐ టీమ్ మొత్తం అక్కడే ఉంది. కేవలం వారి నాయకుడు - మోహన్ సింగ్ తప్ప. అసలు ఈ మోహన్ సింగ్ ఎవరూ అనే అనుమానం అందరికీ వస్తుంది. అదే అనుమానం అరవింద్ కు కూడా వచ్చింది.  లోతుగా విచారిస్తే ఇది అసలు సిబిఐ బృందం కూడా కాదు, వారు ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్న బృందసభ్యులు మాత్రమే అని ఆయనకు తెలిసింది. ఇదేంటి ఏదో ఒక ఉద్యోగం కోసం సిబిఐ లా రైడ్ చేయడం ఏంటి అని అనుమానం ఈ దొంగతనం గురించి మొదటిసారి వినేవాళ్లకు కూడా వస్తుంది. 


విషయం ఏమిటంటే  "ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్ట్ల కోసం డైనమిక్ గ్రాడ్యుయేట్లు కావాలి" అని కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రకటన వేయించాడు మోహన్ సింగ్. అసలే నిరుద్యోగుల దేశం కదా. ఆ ప్రకటన చూసి ఇంటెలిజెన్స్ విభాగం మీద ఆసక్తి ఉన్న ఎంతో మంది అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌కి రావాలని ప్రకటనలో ఆయన చెప్పారు. అలా మోహన్ సింగ్  చివరకి ఇరవై ఆరుగురు వ్యక్తులని ఎన్నుకున్నాడు. వారిలో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నా దానికంటే మెరుగైన ఉద్యోగం కోసం వెతుకుతున్నవాళ్ళు కొందరు ఉన్నారు.  


ఈ ఇరవై ఆరు మందిని మరుసటి రోజు ఉదయం 11 గంటలకు రిపోర్ట్ చేయమని ఆ తరువాత మోహన్ వారికి గుర్తింపు కార్డులను అందజేస్తానని చెప్పాడు. వచ్చిన గంట తరువాత, సింగ్ వాళ్ళందరిని బస్సులో ఎక్కించి  "మనమిప్పుడు ట్రయల్ రెయిడ్ కోసం టి.బి.జెడ్ కు వెళ్తున్నాము. కాబట్టి మీరు మీ బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫైనల్ గా జాబ్ కు సెలెక్ట్ అవుతారు" అని చెప్పాడు వాళ్లకు.


బస్సు ప్రయాణంలో వాళ్ళందరిని ఆయన ఎంత తయారు చేసారంటే అక్కడికి చేరాక వారి ప్రవర్తన టి.బి.జెడ్ సిబ్బంది అందరికి నిజమైన సిబిఐ అధికారుల రైడ్ లాగే అనిపించింది. దాడి జరుగుతున్న మధ్యలో సింగ్ చుట్టూ తిరుగుతూ కొన్ని షోకేసులలో ఆభరణాలను 'శాంపిల్స్' గా తీసుకొని వాటిని పాలిథీన్ సంచులలో పెట్టి, ప్రభుత్వ ముద్రను చూపించే స్లిప్‌లతో సంచులని మూసారు.


మోహన్ ఆ సంచులను తీసుకుంటూ దగ్గరలో ఉన్న మరో దుకాణంలో తనిఖీ చేస్తాను, నాకోసం వెయిట్ చేయండి అని తన సిబ్బందికి చెప్పాడు. తరువాత అతను బస్సులో ఎక్కి, తిరిగి హోటల్‌కు వెళ్లి, ఖాళీ చేసి, టాక్సీ ఎక్కి, మధ్యలో ఒక చోట ఆటోలోకి మారి వెళ్ళిపోయాడు. ఈ విషయం అంతా నిజమైన సీబీఐ ఆఫీసర్  అరవింద్ అక్కడ చేరుకున్నాక తెలుసుకోగలిగాడు. ఆ తరువాత మోహన్ సింగ్ కోసం ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా అతడు దొరకలేదు. 

కొన్ని నెలల తరువాత తాజ్‌లో విచారించినప్పుడు మోహన్ సింగ్ త్రివేండ్రంకు చెందినవాడు అని తెలిస్తే, పోలీసులు దేశం మొత్తం అప్రమత్తం చేయించి, ఒక బృందాన్ని కేరళకు పంపారు. జార్జ్ అగస్టిన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తిని అక్కడ అరెస్టు చేశారు, కాని అతను ఒక చిన్న దొంగ అని తెలియడంతో అతనిని వదిలేసారు. పోలీసులు దేశ వ్యాప్తంగా ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా మోహన్ సింగ్ ను పట్టుకోలేకపోయారు. చివరికి మోహన్ సింగ్ దొరకలేదు. 


ఈ దోపిడీకి  మోహన్ సింగ్ ఎంతో తెలివిగా ఆలోచించాడు. చిన్నా చితకా హోటల్‌ను ఉపయోగించకుండా, చాలా ఖరీదైన తాజ్ నే వాడాడు. ఇంటెలిజెన్స్ వర్గాలు మరీ డబ్బా హోటల్స్ లో ఇంటర్వ్యూలు చేస్తాయా అనే అనుమానం రాకూడదు అండ్ మోహన్ సింగ్ మీద అటు హోటల్ వారికి, ఇటు అతని దగ్గరకు వచ్చిన వారికి అనుమానం రాకుండా.  అతడు కొత్తగా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఒకరి గురించి మరొకరికి తెలియదు అంతే కాదు మోహన్ సింగ్ గురించి కూడా తెలియదు కాబట్టి వాళ్ళను తెలివిగా వాడేసుకున్నాడు. ఆభరణాల షాప్ లో సిబ్బందికి రియల్ సీబీఐ అనిపించేలా వాళ్ళను ప్రిపేర్ చేయడమే అతని తెలివికి నిదర్శనం. చివరి విషయం ఏంటంటే ఇంతచేసినపుడు ఇదంతా సినిమాటిక్ గా ఉందని అనుకుంటారు అందరూ. కానీ విచిత్రంగా సినిమాటిక్ రేంజ్ లోనే అతను తప్పించుకుని మాయమైపోయాడు. ఎక్కడైనా తేడా జరిగితే అనే జంకు లేకుండా ఇంత చేసాడు అంటే అతడు ఎంతో ధైర్యవంతుడు కదా.


దొంగే కావచ్చు, తప్పే చేసుండచ్చు. కానీ దొరకకుండా తప్పించుకోవడం అతడి తెలివితేటలు విన్న తరువాత దొంగను కూడా హీరోలా మెచ్చుకునేస్తారు ఖచ్చితంగా.


ఇప్పుడు మీకు ఏవైనా సినిమాలు గుర్తొస్తాయేమో!!


                              ◆వెంకటేష్ పువ్వాడ.