బంధాన్ని పదిలంగా మార్చే సరికొత్త సిద్దాంతం.. లెట్ దెమ్!

జీవితంలో బంధాలు చాలా అపురూపమైనవి. ముఖ్యంగా జీవిత భాగస్వాముల మధ్య బంధం బలంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది.  అయితే బంధంలో సంతోషం కంటే కలతలు, గొడవలు ఎక్కువగా ఉన్న జంటలే ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలంలో. దీనికి కారణం జీవిత భాగస్వాములు ఒకరినొకరు నియంత్రించాలని, ఒకరు చెప్పిందనే జరగాలని, ఒకరి మాటే నెగ్గాలని అనుకోవడం. దీనివల్ల ఇద్దరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. ఇద్దరి జీవితాలు ప్రశాంతతను కోల్పోతాయి. స్పష్టత లేకుండా తయారవుతాయి.   వీటిని పరిష్కరించి జీవితం సంతోషంగా ఉండటానికి సరికొత్త సిద్దాంతాన్ని పరిచయం చేస్తున్నారు మానవ సంబంధాల నిపుణులు.   లెట్ దెమ్ అనే ఈ సరికొత్త సిద్దాంతం వల్ల  జీవిత భాగస్వాములు ఒకరిని మరొకరు నియంత్రించాలనే ఆలోచన విడిచిపెట్టి స్వీయ నియంత్రణ పాటించడం జరుగుతుందని అంటున్నారు. అసలింతకూ ఈ లెట్ దెమ్ అనే సిద్దాంతం పాటించడం వల్ల కలిగే  ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

గౌరవం..

స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, స్వీయ ప్రోత్సాహం వంటివి ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి.  ఇది జీవితభాగస్వామి దృష్టిలో వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా మారుస్తాయి. ఇద్దరి మధ్య సరిహద్దులు, ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించడం వంటి విషయాలలో ఎప్పుడూ సంతృప్తికర ఫలితాలను ఇస్తాయి. అందుకే లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటించే వ్యక్తులు తమ గౌరవాన్ని పెంచుకుంటారు.

ఎక్స్పెక్టేషన్స్..

లెట్ దెమ్ ను స్వీకరించడం వల్ల వ్యక్తి జీవితం నుండి అంచనాలు, ఆశించడాలు, ఇతరుల విషయంలో ఒత్తిడికి లోనుకావడం వంటివి తగ్గుతాయి. ఇది వ్యక్తిని రిలాక్స్ గా మారుస్తుంది.  భాగస్వాములు ఇద్దరూ లెట్ దెమ్ సిద్దాంతాన్ని పాటిస్తే వారిద్దరి మధ్య ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఇది ఇద్దరి మధ్య సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తుంది.

సరిహద్దులు..

లెట్ దెమ్ సిద్దాంతాన్ని భాగస్వాములు పాటిస్తే వారిద్దరి మధ్య ఆరోగ్యకమైన సరిహద్దులు ఏర్పరుచుకోవడానికి, వాటిని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఇది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవడానికి సహరకరిస్తుంది.

యాక్సెప్ట్ చేయడం..

డిమాండ్ ఉన్నప్పుడు తనకు నచ్చింది మాత్రమే జరగాలనే పట్టుదల, మొండితనం ఉంటుంది. కానీ డిమాండ్ లేకుండా స్వీయ నియంత్రణ ఉన్నప్పుడు భాగస్వామి కోణంలో ఆలోచించడం, భాగస్వామికి సంబధించిన అన్ని విషయాలను స్వీకరించడం, ఇద్దరి మధ్య అంగీకారం  మొదలైనవి సులువు అవుతాయి.

కంట్రోల్..

కోపం, ద్వేషం, ఆవేశం వంటి భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు చాలావరకు భాగస్వాముల మధ్య గొడవలు, అపార్థాలు వస్తుంటాయి. కానీ ఈ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ, స్వీయ విమర్శ, ఆత్మ పరిశీలన మొదలైనవాటి వల్ల భావోద్వేగాలు చాలావరకు నియంత్రణలో ఉంటాయి. ఇవి నియంత్రణలో ఉంటే చాలు.. సహజంగానే ఇద్దరిమధ్య అపార్థాలు తొలగిపోతాయి.  బంధం పదిలంగా ఉంటుంది.


                                      *నిశ్శబ్ద.