పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ప్రచారం? మెగా హీరోలందరూ కూడా!

రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే గతంలోలా కాకుండా పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు.

నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడంతో పాటు తాను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రోడ్ షోలతో జనాలకు దగ్గరౌతున్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలోని బహిరంగ సభలలో పాల్గొనేందుకు మాత్రమే జనసేనాని నియోజకవర్గం వదిలి వెడుతున్నారు. అలా నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి విజయమే లక్ష్యంగా అగుడులు వేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా జనసేనాని గెలుపు లక్ష్యంగా పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. జబర్దన్ కమేడియన్లు ఆది, గెటప్ శ్రీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా శనివారం నియోజకవర్గంలో తన చిన్నాన్న తరఫున ప్రచారం చేశారు. 

ఇవన్నీ ఒకెత్తైతే మెగాస్టార్ చిరంజీవి త్వరలో పిఠాపురంలో  పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనుండటం కూటమికి గట్టి బలం కానుంది. అయితే చిరంజీవి ప్రచారానికి వస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా చిరంజీవి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. ఏవో సినిమాలలో రాజకీయాలను నేను వదిలినా అవి తనను వదలడం లేదన్న డైలాగులు వినా చిరంజీవి ప్రత్యక్షంగా రాజకీయ ప్రసంగాలు చేసిన సందర్భం కూడా లేదు. అయితే ఇటీవల మాత్రం చిరంజీవి బహిరంగంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ మద్దతు ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరు ప్రచారం చేయడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా చెబుతున్నారు. చిరు ప్రచారంతో పిఠాపురంలో జనసేనానికి ఇక తిరుగే ఉండదని అంటున్నారు. చిరు ప్రచారం ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూటమికి పెద్ద బూస్ట్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు, ముఖ్యంగా మెగా హీరోలు జనసేనానికి మద్దతుగా ప్రత్యక్షంగా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.