కామ్రేడ్ల చూపు కారు వైపు!

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ప్రజా సంఘాలు, విద్యార్ధి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలు రాజకీయాలలో కీలక పాత్రను పోషించాయి.ఇందులో విభిన్న భావజాలాల వ్యక్తులు, సంస్థలు ఉన్నా, ప్రధానంగా వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలదే కీలక పాత్ర. నిజానికి, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, వైఎస్ పాదయాత్ర ఎంతగా ఉపకరించిందో, కాంగ్రెస్ తో కలిసి తొమ్మిది వామపక్ష పార్టీల కూటమి సాగించిన విద్యుత్ ఆందోళన అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర కంటే,విద్యుత్ ఆందోళనే ప్రదాన భూమిక పోషించింది. బషీర్ బాగ్ కాల్పుల్లో మరణించిన ముగ్గురు కూడా లెఫ్ట్ పార్టీల కార్యకర్తలే .. అంటే ఆ ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర ఎంత కీలకంగా నిలిచిందో వేరే చెప్పనకరలేదు. 

అలాగే, మలి విడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడంలోనూ, కమ్యూనిస్టు పార్టీల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర కీలకంగానే నిలిచింది. సిపిఎం చివరి వరకు విశాలాంధ్ర (సమైక్య ఆంధ్ర) విధానానికే కట్టుబడి ఉన్నా, సిపిఎం క్యాడర్ సహా వామపక్ష భావజాల ప్రజా సంఘాలు  తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాయి అనేది కాదన లేని నిజం. నిజానికి సిపిఎం జాతీయ నాయకత్వం కూడా, ఒక విధంగా,  ఊ..అనం, ఉహూ..అనం కేంద్రం ఇస్తామంటే కాదనం అనే  తటస్థ వైఖరినే తీసుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, సిపిఎం సాంకేతికంగా మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది. రాజకీయంగా సమర్ధించింది.  

నిజానికి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనే కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తానికి తలమానికంగా నిలిచే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష భావజాలం కేంద్ర బిందువుగా నిలిచాయి. అయినా, ప్రజా పోరాటాల నిర్మాణంలో, ప్రజాందోళనలకు నాయకత్వం వహించడంలో అగ్రభాగాన నిలిచినా కమ్యూనిస్ట్ పార్టీలు, ఎన్నికల రాజకీయంలో మాత్రం వెనకబడి పోయాయి. నిజానికి, 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నిర్భంధాల నడుమ పోటీ చేసిన, అవిభిక్త  కమ్యూనిస్ట్ పార్టీ,  గణనీయ సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది.  

ఆ ఎన్నికల్లో   తెలంగాణ ప్రాంతంలో పీడీఎఫ్ పేరుతొ పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ 45 స్థానాలకు పోటీ చేసి, 26.62 శాతం ఓట్లతో 32 స్థానాలు గెలుచుకుంది. అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు.

అయితే, అనంతర కాలంలో మెల్లమెల్లగా దిగజారుతూ, చివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ ఒక్క స్థానం అయినా నిలుపుకో లేని స్థితికి చేరుకున్నాయి. అయితే, ఈ పరిస్థితి ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలో కూడా నెలకొంది. ఒక్క కేరళలో మినహా కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వ వైభాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచుకోటలుగా నిలిచి , 30 సంవత్సరాలకు పైగా వామపక్ష కూటమి ఏకచత్రాధిపత్యంగా పాలించిన పశ్చిమ బెంగాల్ శాసన సభాలోనూ లెఫ్ట్ కు ఒక్క సీటు దక్కలేదు.అలాగే, ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచుకోటగా నిలిచిన త్రిపురలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఆ రాష్ట్ర శాసన సభలోనూ నామమాత్ర ప్రాతినిధ్యమే కానీ, పెద్దగా సంఖ్యా బలం లేదు. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు ఇంకా అధికారంలో ఉన్నారు. 

అదలా ఉంటే, తెలంగాణను ... పోరాటాల పురిటి గడ్డ గా చరిత్ర పుటల్లో నిలిపిన  కమ్యూనిస్ట్ పార్టీలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఇంత త్వరగా కనుమరుగై పోవడం ఒక విధంగా రాజకీయ పండితులకు కూడా అంతు చిక్కని ప్రశ్నగానే నిలిచింది. రాష్ట్ర విభజనకు ముందు వరకూ కూడా తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ సహా అనేక  జిల్లాల్లో కొంత బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు రాష్ట్ర విభజన తర్వాత ఇచు మించుగా పట్టు కోల్పోయాయి. అంతే కాకుండా, ఎర్ర జెండాకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా నిలించి నేతలు, కుటుంబాలు కుడా ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జెండా మార్చేశారు. ఎర్ర జెండా పక్కన పెట్టి,  గులాబీ జెండాకు జై కొడుతున్నారు. ఇది కొంత చిత్రంగా కనిపించినా నిజం. 
ఒకప్పడు, శాసన సభలో సిపిఎం పక్ష నేతగా, రాష్ట్ర విభజను తీవ్రంగా వ్యతిరేకించిన నోముల నరసింహయ్య, చివరకు తెరాసలో చేరారు. అదే పార్టీ టికెట్ పై నాగార్జు సాగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దురదృష్ట వశాస్తూ ఆయన కన్ను మూశారు. ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు నోముల భగత్, తెరాస టికెట్ మీద పోటీచేసి గెలిచారు. అలాగే, సిపిఐ సీనియర్ నేత, ఒకప్పుడు శాసన మండలిలో ఆ పార్టీ నేత పువ్వాడ నాగేశ్వర రావు కుమారుడు, పువ్వాడ అజయ్ కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి మంత్రి అయ్యారు.. మరో సీనియర్ నాయకుడు, సీహెచ్ రాజేశ్వర రావు, ఎప్పుడొ  ఎర్రచొక్కా విప్పేశారు. తెలుగు దేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు, చెన్నమనేని రమేష్ తెరాస తీర్ధం పుచ్చుకున్నారు.

అలాగే, 2014 ఎన్నికల్లో  గెలిచిన ఏకైక  సిపిఐ  ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా తెరాస తీర్ధం పుచ్చుకున్నారు. ఏపీలో అయితే, అసలు గెలిచిందే లేదు కాబట్టి, పార్టీని వదిలి పోయారనే చింత లేకుండా పోయింది. అయినా ఎపీలోనూ ఒకప్పడు ఎర్ర జెండాల నీడన ఎదిగిన కుటుంబాలు, పాలక పక్షాల గూటికి చేరిపోయాయి. అదలా ఉంటే వామపక్ష పార్టీలు ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ మరోమారు, తమ ఉనికిని కాపడుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేని వాస్తవాన్ని గుర్తించి, పొత్తుల వైపు మొగ్గు చూపుతున్నాయి. నిజానికి గతంలోనూ వామపక్ష పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస ఇలా అన్నిపార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నాయి. అయితే  ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఒకే పార్టీతో పొత్తు పెట్టుకుంటాయా? లేక ఎవరి దారిన వారు, వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. కానీ,  కాంమ్రేడ్ల కన్ను  కారు వైపు  ఉందన్న సంకేతాలు అయితే స్పష్టమవుతున్నాయి.

ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులతో ఇప్పటికే తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విడత చర్చలు జరిపారు.  , ఒక నిర్ణయానికి అయితే ఇంకా రాలేదు. కానీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకత్వం, పొత్తుల విషయంలో  స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర పార్టీలే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. ఈ నేపధ్యంలో టీవీ చర్చల్లో పాల్గొంటున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల మాటలను బట్టి కామ్రేడ్లు తెరాస వైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.మరోవంక కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టిపోటీ ఎదుర్కుంటున్న తెరాస కూడా వామపక్ష పార్టీలతో పొత్తుకు సిద్దంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సో ... కమ్యూనిస్ట్ పార్టీలు కారెక్కే.. చాన్సెస్ కాసింత ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.