కోహ్లీ ఉద్వాసనకు రంగం సిద్ధం..?

దేశంలో క్రికెట్ ఉన్న ఆదరణ ఎంత అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ స్టార్లకు సినీమా స్టార్లతో సమానంగా అభిమానులు ఉన్నారు. అయితే దేశ రాజకీయాలలో ఎన్నిపార్టీలూ, ఆ పార్టీలలో గ్రూపులూ లాగే క్రికెట్ రాజకీయాలలో కూడా అంతకు మించి ఉన్నాయనడంలో సందేహం లేదు. రాణిస్తున్న క్రీడాకారుడిని కిందకు లాగేయడంలో.. విఫలమౌతున్న ఆటగాడిని అందలం ఎక్కించడానికి అవకాశాలు ఇవ్వడంలో ఈ రాజకీయాలదే కీలక పాత్ర. దేశంలో దిగ్గజ క్రికెటర్లకు కొదవ లేదు. అయితే అటువంటి వారికి అవకాశాలు దక్కే విషయంలో మాత్రం క్రికెట్ రాజకీయాలదే పెత్తనం. క్రికెట్ రాజకీయాల కారణంగా ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు కనుమరుగైపోయారు. 1983 లో భారత్ తొలి ప్రపంచ కప్ విజయంలో నాడు జట్టులో ఉన్న ప్రతి ఆటగాడూ కీలకమే. అయితే కెప్టెన్ కపిల్ దేవ్ తరువాత అంతటి ప్రముఖ భూమిక పోషించి.. ఫైనల్స్ లో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచిన ఆల్ రౌండర్ మోహిందర్ అమర్ నాథ్ సరైన అవకాశాలు లభించక కనుమరుగైన సంగతి క్రికెట్ ను ఫాలో అయ్యే ఎవరూ మరచిపోలేరు. ఆగ్రహం పట్టలేక ఒక సందర్భంగా మోహిందర్ అమర్ నాథ్ భారత క్రికెట్ సెలక్షన్ కమిటీని  ‘బంచ్ ఆఫ్ జోకర్లు’ అంటూ విమర్శించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత కూడా క్రికెట్ రాజకీయాల కారణంగా ఇబ్బందులు పడిన ప్రతిభావంతులైన క్రికెటర్లు, ఒత్తిడికి లోనై ఫామ్ కోల్పోయిన క్రీడాకారులూ ఉన్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ లో బ్యాటింగ్ ఆణిముత్యం అయిన సునీల్ గావస్కర్ సెంచరీల వరల్డ్ రికార్డుకు ముందు క్రికెట్ రాజకీయాల కారణంగా ఎంత ఒత్తిడికి గురైనదీ తెలిసిందే.

అనవసర విమర్శలు, కామెంట్లతో తీవ్ర ఒత్తిడికి గురైన గావస్కర్ ఫామ్ కోల్పోయాడు. ఒక దశలో ఆయన 30వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సాధించకుండానే ఉద్వాసనకు గురౌతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటినీ అధిగమించి గావస్కర్ ముందుకు సాగి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గావస్కర్ తరువాత క్రికెట్ దేవుడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్ రాజకీయాల కారణంగా ఇబ్బందులు పడ్డాడు, ఒత్తిడికి గురయ్యాడు. ఫామ్ కోల్పోయి బాధపడ్డాడు. వాటిని అధిగమించాడనుకోండి అది వేరే సంగతి.

కానీ క్రికెట్ రాజకీయాలు ఎంతటి వారినైనా, ఎంతటి ప్రతిభావంతుడినైనా కుంగుబాటుకు గురయ్యేంతగా ఇబ్బందులు పెడతాయనడానికి తాజా ఉదాహరణ కింగ్ విరాట్ కోహ్లీ. తన సంచలన ఇన్నింగ్స్ తో భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విరాట్ కోహ్లీ ప్రస్థుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. పామ్ కోల్పోవడమన్నది ఏ క్రికెటర్ కయినా కెరీర్ లో అతి సహజంగా ఎదురయ్యే ఇబ్బంది. అది తాత్కాలికం. క్రికెటర్ టెక్నిక్ శాశ్వతం.  అద్భుతమైన టెక్నిక్ ఉన్న కోహ్లీ ఫామ్ లేమితో సతమతమౌతున్న సమయంలో క్రికెట్ రాజకీయం అతడిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. సాధనపై దృష్టి కేంద్రీకరించి ఫామ్ ను దొరకబుచ్చుకునే అవకాశం లేకుండా ఒత్తిడి పెంచుతోంది. కరోనా కారణంగా అసలు క్రికెట్ పోటీలే జరగని రెండేళ్ల కాలాన్నీ కూడా కలుపుకుని ఇన్నేళ్ల నుంచీ పరుగులు చేయడంలేదు. పరుగుల యంత్రం సర్వీస్ అయిపోయిందంటూ బీసీసీఐలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కోహ్లీమీద ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.

సహజంగా దూకుడుతో ఆడే కోహ్లీ ఒత్తిడి కారణంగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. ఫామ్ లేమిని సాకుగా చూపి జట్టునుంచి అతడికి ఉద్వాసన పలికేందుకు క్రికెట్ రాజకీయం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా పర్యటనకు విశ్రాంతి పేరుతో కోహ్లీని దూరం చేశారు.

ఇప్పుడు ఈ నెలలో టీమ్ ఇండియా విండీస్ టూర్ కు కూడా పక్కన పెట్టే యోచన చేస్తున్నారు. ఒక దిగ్గజ ఆటగాడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు అతడికి సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం ఇవ్వడం ద్వారా ఫామ్ ను దొరకబుచ్చుకునేందుకు సహకరించాల్సిన క్రికెట్ సెలక్షన్ కమిటీ.. బీసీసీఐ అందుకు భిన్నంగా వ్యవహరించడం విచారకరం. గతంలో గంగూలీ అర్ధంతరంగా తన కెరీర్ ను ముగించేయడానికి కూడా ఇదే కారణం. కోచ్ గ్రెగ్ చాపెల్ తో కలిసి బీసీసీఐ చేసిన రాజకీయమే గంగూలీ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పడానికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కోహ్లీ విషయంలో కూడా బీసీసీఐ అదే పంథాలో నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.