‘జగనన్న అమ్మ ఒడి’ ఖాళీ..

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ప్రచారంలో  జగన్ సర్కార్ డొల్లతనం బయటపడిపోయింది. మీట నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు కుమ్మరించేస్తున్నామంటూ జగన్ చేసుకుంటున్న ప్రచారం పైన పటారం లోన లొటారంలా తయారైందని రుజువైపోయింది. ఇందుకు తాజా నిదర్శనమే జగనన్న అమ్మ ఒడి పథకం. ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించిన ప్రభుత్వం స్వయంగా తానే అర్హులైన లబ్ధిదారులు అంటూ ప్రకటించిన జాబితాలో వారికి కూడా ఖాతాలలో సొమ్ములు సమయానికి పడటం లేదు.

జగన్ స్వయంగా గత నెల 27న శ్రీకాకుళంలో బహిరంగ సభ పెట్టి మరీ లబ్ధిదారుల ఖాతాలలోకి సొమ్ములు జమ చేశామంటూ మీట నొక్కారు. మీట అయితే నొక్కేశారు కానీ అక్కౌంట్లలో డబ్బులు పడలేదు. దాదాపు సగం మంది లబ్దిదారులకు సైతం ఇంత వరకూ ఖాతాలలో సొమ్మలు పడిన దాఖలాలు లేవు. అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదంటూ వారంతా వాలంటీర్ల చుట్లూ తిరిగే పరిస్థితి. ఇంతకూ కారణమేమిటంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు.

డబ్బులు ఉన్నప్పుడు విడతల వారీగా అమ్మ ఒడి సొమ్ములకు ఖాతాలలో జమ చేస్తున్నారు. ఇంత మాత్రం దానికి బహిరంగ సభ పెట్టి మరీ మీట నొక్కాను మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయి చూసుకోండి అంటూ గప్పాలెందుకని జనమే ప్రశ్నిస్తున్నారు. గత నెలలో లిక్కర్ బ్యాండ్లు తనఖా పెట్టి మరీ తెచ్చిన అప్పులు జాతీలకే సరిపోయాయి. అలా సరిపోగా మిగిలిన సొమ్మును లబ్దిదారుల ఖాతాలలో వేశారు. అవి సగం మందికి కూడా సరిపోలేదు.

మిగిలిన వారికి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వేస్తామని అధికారులు చెబుతున్నారు. బాండ్ల వేలంతో గత మంగళవారం అంటే ఈ నెల 5 ఆర్బీఐ నుంచి మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు సంపాదించిన ప్రభుత్వం ఆ సొమ్ములో కొంత జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత విధించడమే కాకుండా, మిగిలిన లబ్ధిదారులకు సైతం సకాలంలో అమ్మఒడి సొమ్ములు అందించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. దీంతో ముందు ముందు ఈ పథకం కొనసాగేనా, ప్రభుత్వం కొనసాగించగలదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.