మరో ప్రమోషన్‌పై కేటీఆర్ కన్నేశారా..?

ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికను తన భుజాలపై వేసుకుని టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్‌‌కు మరో ప్రమోషన్ దక్కనుందా..? అదే నిజమైతే కేసీఆర్ తన కుమారుడికి ఎలాంటి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది? కొడుకు పుట్టినపుడు కాదు..అతడు ప్రయోజకుడు అయినప్పుడే..ఊరువాడా అంతా కొడుకు గురించి చెబుతుంటే..తన కొడుకు అడగకుండానే ఏదైనా ఇచ్చేస్తాడు ఆ తండ్రి. ఇప్పుడు అచ్చం ఇలాంటి సంతోషంలోనే ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అన్నీ తానై వ్యవహరించి హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా గులాబీ జెండాను రెపరెపలాడించి ఆ విజయాన్ని నాన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా అందించారు కేటీఆర్. ఆ సంతోషంతో ఉప్పొంగిపోయిన సీఎం, కేటీఆర్‌కు ప్రమోషన్ కల్పించారు.

 

కేటీఆర్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇచ్చి..జూపల్లి వద్ద ఉన్న పరిశ్రమల శాఖను కేటీఆర్‌కు అప్పగించారు. గ్రేటర్ విజయంతో మున్సిపల్ శాఖ కేటీఆర్‌కు కానుకగా వచ్చింది. దాంతో పాటు ఇటీవల జరిగిన శాఖల మార్పుల్లో కూడా కొడుకుని సర్‌ప్రైజ్ చేయడానికి మరి కొన్ని శాఖలను కేటీఆర్‌కు ఇచ్చారు కేసీఆర్. ఈ గిఫ్ట్‌తో కలిపి కేటీఆర్ వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, మైన్స్ అండ్ జియాలజీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ఎన్నారై వ్యవహారాలు ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి తర్వాత కీలక శాఖలన్ని కేటీఆర్ చుట్టూనే ఉన్నాయి.

 

 ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాలేరు ఎన్నికలకు కూడా కొడుకుని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల గెలుపును కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అందుకనుగుణంగానే కాళ్లకు బలపం కట్టుకుని సైతం ప్రచారాన్ని నిర్వహించారు. సెంటిమెంట్‌ను ప్రధాన ఆయుధంగా చేసుకోవడంతో పాటు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. అటు విపక్షాలన్నీ ఏకం కావడంతో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటి చేస్తోంది. ఈ నేపథ్యంలో పాలేరులో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్థేశించే రెడ్డి సామాజికి వర్గానికి చెందిన వైసీపీ ఎంపి పొంగులేటితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలను కేసీఆర్ టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నారు. దీని వెనుక కేటీఆర్ చక్రం తిప్పినట్లు సమాచారం.

 

అన్నీ అనుకున్నట్లు జరిగితే పాలేరులో కారు జోరు నల్లేరుపై నడకలా సాగిపోనుంది. అదే జరిగితే మరోసారి కేటీఆర్‌కు ప్రమోషన్ దక్కనుందని తెలంగాణ భవన్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వంలో మాత్రమే ప్రమోషన్ ఇచ్చి తన వారసుడు కేటీఆరే అని తేల్చిన కేసీఆర్. ఇప్పుడు పార్టీ పరంగా కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని టీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నాయి. ఇవి పుకార్లా లేదంటే నిజంగానే కేసీఆర్ మనసులో ఇదే ఉందా అనేది త్వరలోనే తేలిపోనుంది.