అమరావతిని స్మశానంతో పోల్చిన ప్రభుత్వం.. రావణ కాష్టం రగల్చనుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు. అదే విధంగా భవిష్యత్తులో ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తానేనని తప్పక చెప్పుకుంటారని, అందుకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిని తరలించడమే కాకుండా అమరావతిని సర్వ నాశనం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వైఎస్ జగన్  నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు.

అమరావతే రాజధానిగా ఉండాలని ఎడతెగని ఉద్యమం చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజలపైకి వేరే ప్రాంత ప్రజలను యుద్ధానికి పంపుతున్నది. అమరావతి భూములలో దాదాపు నాలుగు వేల ఎకరాలను పేదలకు పట్టాలుగా పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందనే వార్తలు గుప్పు మనడంతో రాజధాని ప్రాంతాల రైతులు అలోలక్ష్మణా అంటూ ఏడుస్తున్నారు.

రాజధాని తరలిపోవడం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేయడం మరొక ఎత్తు. పేదలకు పట్టాలు ఇచ్చేస్తే వారు వచ్చి ఆక్రమించుకుంటారు. దాంతో అమరావతి ప్రాంతంలో అంతర్యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. వేరే ఊరుకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమరావతి ప్రాంత ప్రజలు అడ్డుకుంటే అంతర్యుద్ధం తప్పదు.

అమరావతి ప్రాంత రైతులు బాగా బలిసిన వారని అందుకే పేద ప్రజలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి నేతలు ప్రచారం మొదలు పెడతారు. దాంతో ఈ సమస్య మరింత తీవ్ర తరం అయి అమరావతి సర్వ నాశనం అవుతుంది. దాదాపు నెల కిందటే అమరావతి భూములను పందేరం చేయాలనే ప్రతిపాదన పెట్టారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు.

గ్రామ సచివాలయం అధికారులు విజయవాడ గుంటూరు పట్టణాలలో భూముల కోసం అర్జీ పెట్టుకున్న పేదల నుంచి అమరావతి గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమా అనే అభిప్రాయ సేకరణ మొదలు పెట్టేసరికి విషయం అమరావతి రైతులకు తెలిసింది. దాంతో వారి కలలు పటాపంచలు కావడమే కాకుండా సాటి ప్రజలతో పోరాడే స్థితికి తమను ప్రభుత్వం నెట్టివేస్తోందని ఆగ్రహిస్తున్నారు.

తాము భూములు ఇస్తే తమ ప్రాంతం సింగపూర్ హాంకాంగ్ లాగా అవుతుందని కలలు కన్నారు. ఇప్పుడు రాజధాని అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా తమ భూములను అందరికి పంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలో వారికి అర్ధం కావడం లేదు.

కసితో కక్షతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలో వారికి అర్ధం కావడం లేదు. నాలుగు వేల ఎకరాలు పేదవారికి పట్టాలిచ్చి పంచితే అక్కడకు లక్షల సంఖ్యలో జనాభా వచ్చేస్తారు. వారంతా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, చెత్త డంప్ చేయడానికి, ఉపయోగించిన ప్లాస్టిక్ ను పడేయడానికి కృష్ణానదిని వాడితే ఇక కృష్ణమ్మ మరో మూసీగా మారక తప్పదు.

కృష్ణా నది గర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కొందరు బడాబాబులు పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ భవనాలన్నింటిని కూలగొట్టి కృష్ణా నదిని కాపాడతానని చెప్పడమే కాదు..దానికి నాందిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టారు కూడా. తర్వాత అక్కడ ఉన్న భవనాల యజమానులకు తాకీదులు కూడా ఇచ్చారు. కానీ కోర్టుల జోక్యంతో అక్కడ ఉన్న భవనాలను అంగుళం కూడా ఆయన కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని జనాలతో నింపేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు కనపడుతోంది. నది ఓడ్డున రాజధాని కడితే మునిగిపోతుందని ఉదర కొట్టిన జగన్ ప్రభుత్వం అక్కడ పేదలకు పట్టాలు ఎలా ఇస్తుంది? నది పొంగి పేదలంతా మునిగిపోతే ఫర్వాలేదా? ప్రజల పైకి ప్రజలనే రెచ్చగొట్టి చోద్యం చూసే ప్లాన్ ఇది..అని రాజధాని ప్రాంత రైతులు, ప్రతి పక్షాలు అంటున్నాయి.