జగన్‌కి "ఆ ఒక్కటి" దక్కనివ్వరా..?

నా అనుకున్న వారు..నమ్మిన వారు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడుతుంటే ఎం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌పై పిడుగు లాంటి వార్త పడింది.  శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు నెల రోజుల వ్యవధిలో వైసీపీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారని బాంబు పేల్చారు. ఈ వార్త విన్నప్పటి నుంచి జగన్‌కు నిద్రపట్టడం లేదు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై వచ్చే నెలలో ఎలక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో అచ్చెన్న వ్యాఖ్యలు జగన్‌ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఏపీ నుంచి నాలుగు స్థానాలకు జరిగే ఎన్నికల్లో సంఖ్యా బలం రీత్యా మూడు టీడీపీకీ, ఒకటి వైసీపీకి దక్కే అవకాశముంది. కాని వైసీపీకి ఉన్న ఒక్క సీటును దక్కకుండా చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

 

ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్థతు అవసరం. గడచిన సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున 67 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి 102 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా..తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గాల స్వతంత్ర్య ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో పాటు మిత్రపక్షమైన బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీటన్నింటికి మించి వైసీపీ నుంచి గెలిచిన 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో సైకిల్ బలం 125కు చేరింది. దీంతో టీడీపీ అవలీలగా మూడు స్థానాలు గెలుచుకోవచ్చు. వైసీపీ విషయానికి వస్తే జంపింగ్ ఎమ్మెల్యేలు పోను చివరికి 50 మంది మిగిలారు. దీంతో ఒకే ఒక్క స్థానానికి పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా దక్కకుండా చేయడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

 

ముందుగా రాజ్యసభ ఎన్నికల నాటికి వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను నయానో, భయానో తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. మిగతా పది మందిని దశల వారీగా పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నట్లు లోటస్‌పాండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటి దాకా టీడీపీలో విడతల వారీగా ఎమ్మెల్యేలు చేరారు. అయితే కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతారా? అన్న అనుమానాలు జగన్‌తో పాటు రాజకీయ విశ్లేషకుల బుర్రల్ని తొలిచివేస్తున్నాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ కూడా మరో 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అప్పట్లో ప్రకటించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే..జగన్‌ పార్టీ నుంచి ఎవరూ రాజ్యసభలో అడుగుపెట్టకుండా చేయాలన్నది టీడీపీ స్కెచ్.