తెలంగాణ ప్రజలు తినే అన్నంలో మన్ను పోసుకున్నారు : కేటీఆర్
posted on Apr 20, 2025 3:28PM

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చేరిగారు. తెలంగాణ భవన్‌లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారందరికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తినే అన్నంలో మట్టిపోసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఓటర్ హైదరాబాద్ ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారని.. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఔటర్ లోపల కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలకు ప్రజలు మోసపోలేదు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదు. గోషామహల్ కూడాపోయేది కాదు.. ఆగమాగం వల్లే పోయింది. ప్రజలు ఎప్పుడైనా మంచి పనులను ఆదరిస్తారు అని కేటీఆర్ అన్నారు. ఇవాళ చంద్రబాబు జన్మనదినం.. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.
ఆయన ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. సంస్కారవంతమైన ప్రభుత్వం గత ప్రభుత్వాలను గౌరవిస్తూ ప్రవర్తిస్తది అని కేటీఆర్ తెలిపారు.మేం పదేండ్ల ఉన్నాం.. ఆనవాళ్లు చెరిపేస్తాం అనలేదు. అది అనాగరిక చర్య. కాకతీయుల ఆనవాళ్లను కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు కూడా చెరిపేయలేదు. కానీ రేవంత్ సర్కార్ కిరాతక పనులు చేస్తుంది. మంచి పనులు చేయరు. చేసిన మంచి పనులను ఆపుతారు. అభివృద్ధికి అందరం సహకరిస్తాం. కానీ16 నెలల్లో విధ్వంసం జరిగింది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు.. 500 రోజుల తర్వాత కూడా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఒక్కటే ఒక్కటి ఫ్రీ బస్సు అమలు చేశారు. ఇప్పటి వరకు చూడని చిత్రవిచిత్రాలు ఆర్టీసీ ఉచిత బస్సుల్లో చూస్తున్నాం అని కేటీఆర్ అన్నారు. తులం బంగారం కోసం ఆడబిడ్డలు ఆశపడ్డారు. రైతుబంధు రూ. 15 వేలు అని చెప్పేసరికి రైతులు కూడా ఆశపడ్డారు. రూ. 2 లక్షల రుణాల వరకు మాపీ చేస్తామని చెప్పేసరికి ఆశపడ్డారు. రూ. 4 వేల పెన్షన్ ఇంటికి ఇద్దరికి ఇస్తామని చెప్పేసరికి ఆశపడ్డారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని రాహుల్ గాంధీ అశోక్ నగర్‌లో ఫోజులు కొట్టి చెప్పేసరికి.. మనం ఇచ్చిన 1 లక్షా 60 వేల ఉద్యోగాలు మరిచిపోయారు. పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయ్యారు. 420 వాగ్దానాలు చేసి మోసం చేశారు కాంగ్రెసోళ్లు. డిక్లరేషన్ల పేరిట మోసం చేశారు.