తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్
posted on Apr 20, 2025 1:26PM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, అశోక్‌బాబు, వీవీవీ చౌదరి, నన్నపనేని రాజకుమారి, ఎ.వి.రమణ హాజరయ్యారు. విజనరీ లీడర్ చంద్రన్న పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నేతలు తిలకించారు. చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమల అలిపిరి మార్గంలో పార్టీ కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా కొబ్బరికాయాలు కొట్టి పూజలు చేశారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. వేడుకలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి, నందమూరి సుహాసిని, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, టీడీపీ నేత అరవింద్‌కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని.. ఆయన విజయాలకు పొంగిపోలేదని.. అపజయాలకు కుంకుంగిపోలేదని అన్నారు. అధికారం ప్రజలకు సేవ చేసేందుకేననని నమ్మిన నేత చంద్రబాబు అని,‘చంద్రబాబు P4’ కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణలో, అంకిత భావంలో, భవిష్యత్తు కార్యాచరణలో, సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశ నాయకులకే సీబీఎన్ ఆదర్శమని అన్నారు. సీబీఎన్ నాయుడు సారధ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని.. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న నేత చంద్రబాబు అని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న నేత చంద్రబాబు అని పల్లా శ్రీనివాసరావు కొనియాడారు.