కిరణ్ కుమార్ రెడ్డి నోట అధిష్టానం మాట

 

ఇంతకాలం టీ-కాంగ్రెస్ యంపీల విషయంలో ఎన్నడూ కలుగజేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు వారు పార్టీ వీడి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే తనదయిన శైలిలో ప్రతిస్పందించడం విశేషం.

 

“ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు పార్టీలు మారే స్వేచ్చ ఎప్పుడూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్చ మరికొంచెం ఎక్కువగా ఉన్నందునే వారు నేడు వేరే పార్టీలోకి స్వేచ్చగా వెళ్ళగలుగుతున్నారు. గత 40-50 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణా అంశాన్ని, కొందరు రాత్రికి రాత్రే తేల్చమని చెప్పినంత మాత్రాన్న తేలిపోదు. దానిని వారంలో తేల్చేయమంటూ అధిష్టానానికి డెడ్ లైన్లు పెడితే దానికి పార్టీ తలొగ్గదు. పార్టీలో ఉన్నవారెవరయినా పార్టీ అధిష్టాన నిర్ణయానికి, పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాల్సిందే,” అని అన్నారు.

 

ఆయన కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఉన్న మాటలనే పలుకుతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపై తెలంగాణా అంశంపై పార్టీ నిర్ణయానికి లోబడి ఉండలేని వారు, పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడేవారు అందరూ కూడా వివేక్, మందా, కేశవ్ రావులు వెళ్ళినట్లే బయటకి వెళ్లవచ్చునని ఆయన చెప్పకనే చెపుతున్నారు. ఇది పార్టీలో మిగిలిన తెలంగాణా నేతలకి హెచ్చరిక వంటిదే. రేపటి నుండి బొత్స సత్యనారాయణ వంటివారు కూడా ఇటువంటి హెచ్చరికలే చేసినా ఆశ్చర్యపోనసరం లేదు.