కాంగ్రెస్ తో దోస్తీ కటీఫ్...ఇక కేసీఆర్ తో

 

టీ-కాంగ్రెస్‌ యంపీలు వివేక్, మందా జగన్నాథం, కె. కేశవరావు ముగ్గురూ కేసీఆర్ తో సుదీర్గ మంతనాలు జరిపిన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాము విదించిన గడువులోగా పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యం లేదని భావించినందునే తాము పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. జూన్ 2న నిజాం కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో తెరాసలో అధికారికంగా జేరుతామని వారు ప్రకటించారు.

 

ఎంపీ వివేక్ ఇంట్లో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో వివేక్‌, కే.కేశవరావు ఆయన కుమారుడు విప్లవ్, మంధా జగన్నాధం, ఆయన కుమారుడు కూడా పాల్గొన్నారు. వారి కుమారులకి కూడా టికెట్స్ విషయంలో కేసీఆర్ స్పష్టమయిన హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజయ్యకు పార్టీ టికెట్ హామీ ఇవ్వనందున ఆయన తెరాసలో చేరేందుకు వెనుకడుగు వేయడంతో, కేసీఆర్ ఆయనతో కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఆయనకు కూడా తగిన హామీ ఇచ్చి జూన్ 2న జరిగే సభలో పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

 

ఇక కాంగ్రెస్ యంపీల రాకతో ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని కేసీఆర్ అన్నారు. వారి చేరికని పార్టీలు మారడంగా చూడకుండా ఉద్యమంలో చేరుతున్నట్లే చూడాలని కేసీఆర్ కోరారు.

 

ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం తెచ్చినప్పటికీ, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండని వారిపట్ల పార్టీ ఎటువంటి వైఖరి అవలంబిస్తుందో స్పష్టం చేసింది. తెలంగాణా పేరిట తమను ఎవరూ కూడా బ్లాక్ మెయిల్ చేయలేరని, పార్టీకి లోబడి ఉండలేని వారు నిరభ్యంతరంగా బయటకి వెళ్లిపోవచ్చునని స్పష్టం చేసినట్లయింది. తద్వారా ఇక ముందు మిగిలిన నేతలెవరూ కూడా తెలంగాణా అంశంపై పార్టీని ఇబ్బంది పెట్టే సాహసం చేయరు.

 

కేవలం ఇద్దరు యంపీలను వదులు కోవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ మిగిలిన అందరిపై గట్టి పట్టు సాదించినట్లు అర్ధం అవుతోంది. ఇది చదరంగంలో రాజును రక్షించుకొనేందుకు కొన్ని బంట్లను, సైన్యాన్ని వదులుకొన్నట్లుగానే భావించవచ్చును. అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి దీని వల్ల మేలే జరిగే అవకాశం ఉంది గనుకనే వారి గడువును పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది.

 

ఇక, తెదేపా నాగర్ కర్నూల్ ఇన్-చార్జ్ జనార్ధన్ రెడ్డి కూడా తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెరాస నేత జితేందర్ రెడ్డి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.