ప్రకాశంలో వైసీపీ ఎమ్మెల్యేల పక్క చూపులు

జగన్ బంధుగణం ఆధిపత్య పోరుతో ప్రకాశం జిల్లా వైసీపీ కుతకుతలాడుతోంది, ముఖ్యంగా బావ, బావమరిది మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని చెప్పుకుంటున్నారు, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంచాయితీతో వైసీపీ కొంపకొల్లేరవుతోందని, వీళ్లిద్దరి మధ్యా ఆధిపత్య పోరు పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తోందంటున్నారు, రెండు ఎంపీ, పదమూడు ఎమ్మెల్యే స్థానాలున్న ప్రకాశం జిల్లాలో ఒక ఎంపీ, ఆరు ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఒడ్డున పడ్డా... బావ బారమరిది పోరుతో జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని అంటున్నారు.


తన ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని రగిలిపోతున్న బాలినేని... జిల్లా పార్టీలో వైవీ పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నారని, దాంతో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. జగన్ జైలుకెళ్లకముందు జిల్లాలో బాలినేని హవా నడిస్తే... జైలుకెళ్లాక వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పారని, ఇప్పుడు కూడా వైవీ ఎంత చెబితే అంత అన్నట్లు ఉందని, దాన్ని బాలినేని జీర్జించుకోలేకపోతున్నారని అంటున్నారు, బావ బావమరుదల ఎత్తుకు పైఎత్తులతో ప్రజల్లో పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

జగన్ బంధువులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో ప్రకాశం జిల్లాలో పార్టీ నలిగిపోతుంటే, ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావులు జగన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఏదోరోజు గోడ దూకేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది, ఇప్పటికే తెలుగుదేశం లీడర్స్ తో టచ్ లో ఉన్నారని, త్వరలో పార్టీ మారడం ఖాయమని చెప్పుకుంటున్నారు

ఇక గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాలినేని కూడా జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నాడని, ఎమ్మెల్సీ సీటు ఇస్తాడని ఆశలు పెట్టుకుంటే నోరు మెదపడం లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట, అయితే పార్టీని చక్కదిద్దాల్సిన జగన్మోహన్ రెడ్డి... బావబావమరుదుల్లో ఎవరికీ నచ్చచెప్పలేక ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు, అందుకే వీరిద్దరినీ కాదని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, అయినప్పటికీ ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి గాడిలో పడలేదని చెప్పుకుంటున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu