కేజ్రీవాల్ 2 కోట్లు తీసుకున్నాడు.. నేనే చూశా..!
posted on May 8, 2017 11:20AM
.jpg)
ఇప్పటికే పలు పార్టీ నేతల వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు ఇప్పుడు స్వయంగా తనపైనే ఆరోపణలు వచ్చిపడటంతో మరింత చిక్కుల్లో పడ్డట్టయింది. అవినీతిని అంటగడతాం.. అవినీతిని సమూలంగా నిర్మిలిస్తాం అని చెప్పిన ఆయనపైనే ఇప్పుడు అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం.
మాజీ మంత్రి కపిల్ మిశ్ర కేజ్రీవాల్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కపిల్ మిశ్రను పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన నివాసంలో సత్యేంద్ర జైన్ (దిల్లీ ఆరోగ్య, ప్రజా పనుల శాఖ మంత్రి) రూ.2 కోట్లు నగదు ఇస్తుండడాన్ని నా కళ్లతో నేను స్వయంగా చూశానని. ఇదేమిటని నేను కేజ్రీవాల్‌ను అడిగినప్పుడు ఇలాంటివి రాజకీయాల్లో జరుగుతుంటాయని అన్నారని... దీని గురించి తరువాత చెబుతానని తెలిపార’ని ఆరోపించారు. అంతేకాదు కేజ్రీవాల్ బంధువులకు చెందిన భూ వివాదాన్ని తాను పరిష్కరించినట్టు జైన్ తనకు స్వయంగా చెప్పారని..అయితే ఇదే విషయాన్ని కేజ్రీవాల్ ను అడిగితే అదంతా అబద్దం అని చెప్పారని అన్నారు. ‘చాలా కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నా కేజ్రీవాల్‌ను ఎవరూ ప్రభావితం చేయలేరని అనుకునే వాడిని.. అక్రమ నగదు చలామణి, నల్లధనం, విలాసవంతమైన బస్సుల కొనుగోళ్లు తదితర వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసు.. వాటిపై ఆయన చర్యలు తీసుకుంటారని అనుకునేవాడిన’ని మిశ్ర వివరించారు. ఇక మిశ్రా చేసిన ఆరోపణలపై స్పందించిన పార్టీ నేతలు మాత్రం వాటిని ఖండించారు. మిశ్రా కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడే వ్యక్తి కాదని అంటున్నారు. ఇక దీనిపై స్పందించిన ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూద్దాం..