అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలతో కేంద్రంతో కేసీఆర్ యుద్ధం మరో లెవెల్ కు

కేంద్రంతో యుద్ధాన్ని కేసీఆర్ మరో లెవెల్ కు తీసుకువెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు కూరుకుపోవడమే ఇందుకు కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. సంపన్న రాష్ట్రం తెలంగాణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడానికి కేంద్రమే కారణమంటూ కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తడానికి రెడీ అయిపోయారు. ఇందు కోసం ఆయన వచ్చే నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చాటేందుకు సిద్ధమైపోయారు. అసలు విషయమేమిటంటే.. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్లుగా రుణాలు అందడం లేదు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారని.. వాటినీ   రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.అయితే అదే సమయంలో కేంద్రం ఏపీ పట్ల అవాజ్యానురాకం ప్రదర్శిస్తూ ఎడాపెడా అప్పులకు అనుమతులు ఇస్తుండటంతో సహజంగానే కేంద్రం తెలంగాణ పట్ల రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

ఆ విషయాన్నేఇప్పుడు అసెంబ్లీ వేదికగా జనానికి వెల్లడించేందుకు కేసీఆర్ రెడీ అయిపోయారు.  తెలంగాణపైక కేంద్రం కక్ష పూరిత ధోరణిలో వ్యవహరిస్తూ పురోగతిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని కేసీఆర్ అంటున్నారు. అభివృద్థి బాటలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణను నిలువరించేందుకు అనవసర ఆంక్షలతో కేంద్రం కళ్ళేలు వేస్తున్నదని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చాటాలని నిర్ణయానికి వచ్చేశారు.   

తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా గండి పడటాన్ని   ప్రజలకు వివరించి  కేంద్రం వివవక్షను  ప్రజలందరికీ సవివరంగా తెలియజెప్పేందుకు వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో వారం రోజులపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై లోతైన చర్చను చేపట్టేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది.  

కేంద్రం అనుసరిస్తున్నఅసంబద్ధ ఆర్థిక విధానాల ద్వారా రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారిందని కేసీఆర్ గత కొంత కాలంగా ప్రతి వేదికపైనా గట్టిగా చెబుతున్న సంగతి విదితమే. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించే రాష్ట్రాలు  బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకున్నది.

కాగా, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయి. అంతే కాకుండా ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి ఉంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టిందని కేసీఆర్ సర్కారు ఆరోపిస్తోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణ నిర్ణయంతో మొత్తం మీద కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకే కేసీఆర్ సిద్ధమయ్యారని చెప్పాల్సి ఉంటుంది.